"వీడెవడండి బాబు? ఇదేమి వింత ప్రశ్న వేస్తున్నాడు" అనుకుంటున్నారా? మీలో కొందరైతే, "యా యేంటి నువ్వెళ్ళగలవా పెద్ద ?" అని నిలదీయదల చుంటారు కూడా. ఏదేమైనా చాలా రోజులైంది బ్లాగి అని ఒ ఆసక్తికరమైన విషయం దొరికి బ్లాగుతున్నా.
ఉపోద్ఘాతంఈ మధ్య దెయ్యాల గురించి పెద్దలు చాలా మంది వ్రాస్తున్నారు. కొందరు 55 మాటల్లో కథలు అనే వర్గంలో దెయ్యాల గురించి
హాస్యంగా వ్రాసినా, మరి కొందరు పెద్దలు చాలా సీరియస్ గా
క్షధ్రశక్తుల గురించి వ్రాస్తున్నారు. నేనేమో పాశ్చాత్య విద్యా విధానంలో అభ్యాసం పొంది, భారత తత్వ శాస్తాల మద్య పెరిగాను. దానికి తోడు కాళీ సమయం ఎక్కువై, భౌతిక శాస్తం యొక్క హద్దుల గురించి ఆలోచించడం వగైరా చేస్తున్నా. ఈమధ్య దేనినీ నమ్మడానికి లేదన్నట్టుంది ప్రపంచం.
911 నుండి ఆర్యనుల దండయాత్ర వరకూ అన్నిటి మీదా సందేహాలే.
ఏదేమైనా ఈ గోడలలోనించి వెళ్ళే అంశం పై నా రెండు పైసల దక్షణం నేను సమర్పించు కుందామని నిశ్చయించా.
Assumptions౧) మీకు భౌతిక కాయం ఉంది. అంటే మీరు ఆత్మ మాత్రమే కాదు, శరీరం కూడా. ఒక్కముక్కలో మీరు దయ్యం కాదన్నమాట.
౨) మీరు గోడలోనించి వెళ్ళడానికి పట్టే సమయం మామూలుగా ఓ రెండడుగులు వేసేంత కంటే చాలా ఎక్కువ ఉండకూడదు.
౩) గోడకు ఎమీ అవకుండానే మీరు ఇప్పుడు ఇటువైపు ఉన్నవారు అటువైపు చేరుకోవాలి.
౪) గోడ వైశాల్యం (ఎత్తు x వెడ్లపు ) అనంతం. అంటే వేరే మాటల్లో, గోడ చుట్టూ దిరిగి వెళ్ళడం వీలుకాదు.
౫) గోడలో ఉన్న అన్ని elements, periodic table కి చెందిఉండాలి. అంటే వేరే మాటల్లో అది నిజమైన సహజమైన గోడ అయ్యుండాలి.
౬) గోడ మందం సున్నా కంటే హెచ్చు.
ఉన్న మార్గాలుగోడల్లోనుండి నడవడానికి రెండు మార్గలున్నాయి. అవును నిజం మీమీదొట్టు, నాకు పరిమితమైన విజ్ఞానం ప్రకారం రెండే ఉన్నాయి. మీకు ఇంకా ఎక్కువ విధానాలు తెలిసుండొచ్చు.
ఒకటో పద్ధతిమనకూ చీమలకూ ఉన్నా తేడా ఎమిటి?
చీమలు హింసకూడిన మతిలేని సినిమాలను అఖండ విజయం చేయవు. పైగా అవి రెండు dimensions లోనే కదలగలవు. అంటే అవి పైకీ కిందకీ కదలలేవు.
చీమ దారిలో పెన్సిల్ పుల్ల పెడితే అది దాన్ని దాటి వెళ్ళలేదన్న విషయం మనమందరం చిన్నప్పుడు ఓ వర్షాకాలం సాయంత్రం ఆడుకోవడానికి మిత్రులెవరూ లేనప్పుడు చీమలను హింసిస్తూ గ్రహించిన విషయమే.
చీమలకు పెన్సిలెలాగో మనకు గోడలలాగ అన్నమాట. మీరూ నాలాగా దయా దక్షణ్యం ఉన్నవారైతే అ చీమ బాధ చూడలేక దానిని పైకేత్తి ఆ పెన్సిల్ కి అటువైపు చేర్చివుంటారు. అంటే 2 dimensional space అయిన మీ అరుగు నుండి ఆ చీమను 3rd dimension లోకి తీసుకెళ్ళి మళ్ళి దాన్ని తిరిగి 2 dimensional space అయిన మీ అరుగు మీద పెట్టారు. అలాగే 3 dimensional space అయిన ఈ గది లోనుండి మిమ్మల్ని మీ ఇష్ట దైవం 4వ dimension లోకి లేవనత్తి , తిరిగి గోడకు అవతలి పక్క వదలాలి.
అది వీలవ్వాలంటే మీకు లాగానే మీ ఇష్ట దైవనికి కూడా మంచి వేళ్ళు ఉండాలి. మీ ఇష్ట దైవం మా తమ్ముడు లాంటోడైతే, గోడకు వేరే పక్క మీ భౌతిక కాయం మాత్రమే చేరుతుంది. ఇది మన assumptions ని ఉల్లంఘించట్లేదు గా, చచ్చైనా సాదిధ్ధాం అనే మతం ఉన్నవారైతే కానీయండి.
ఈ నాలుగో dimension తిరకాసు చీమల్ని చంపినట్టు వివరించినా అర్థం కాని వారికోసం ఇంకో వివరణాయత్నం.
మీ ఇష్ట దైవం కాల యముడైతే. ఆయని ఇష్టడైమెన్షన్ అయిన కాలాన్ని వెనక్కి తిప్పి, గోడ లేని సమయం చూసి మిమ్మల్ని ఇవతలి పక్క చేర్చి, సడి సప్పుడూ లేకుండా కాలాన్ని మళ్ళి ముందుకు తిప్పేస్తాడు. గోడ ఉన్న చోటే ఉంటుంది, మీరు అవతలపక్కుంటారు. ఇప్పుడు అర్థమయ్యుందా?
అన్నట్టు కాల యముడు ప్రత్యక్షమైనప్పుడు నేను రిఫర్ చేసానని చెప్పడం మర్చిపోకండి. అసలే కలి కాలం లో పుణ్యం దొరకడం కష్టమైపోయుంది నిరుద్యోగులకు.
రెండో పద్ధతిమీ తీగలువాడని దూర్వణి పరికరం (ఉరఫ్ సెల్ ఫోను) సంకేతాలు గోడల్లో నుండి వెళ్ళగలవు. అలానే మీరు కూడా వెళ్ళగలగాలి కదా??
మీరు తెలివైన వారు, తెలుగు లాంటి కష్టమైన భాష చదవనేర్చిన వారు, కాబట్టి వెంటనే మీరు, వాటికి భౌతిక కాయం లేదు గనుక వాటికి assumption ౧ అబ్బదు గనక వేరే మాట చెప్పమంటారు.
నేను ఇరవై ఏళ్ళగా భౌతిక శాస్తం చదువుతున్నా కాబట్టి,
" ఆ తరంగాలకు కాంతితో పోల్చగల్గిన వేగం ఉంది కాబట్టి, ఐన్‌స్టైను ప్రకారం వాటికి బరువు ఉంటుంది" అని మీరెవరూ నిరూపించలేని వితండవాదం చేస్తా.
మీరు వెంటనే, " విధ్యుత్తరంగాలవలె నీవు కూడా గోడలలో నుండి వెళ్ళగలవా ? ఐతే ఏది వెళ్లు " అంటారు.
"కాని పౌలీ ఎక్సక్లూజౕన్ నీతి" (
Pauli Exclusion Principle ) వల్ల అది నా ప్రస్తుత భౌతిక స్థితిలో సాధ్యం కాదు" .
నా వంటి లో ఉన్నవి, న్యూట్రాన్లు, ఎలక్ట్రాన్లు మరియు ప్రోటాన్లు. అవి మూడు ఫెర్మియాన్లు కాబట్టి అవి వాటి స్థితిని వేటితోనూ పంచుకోవు కాబట్టి, అలాంటి రెండు పార్టికల్లు ఒక చోట ఉండలేవు. కనుక నేను assumption ౫ ఉల్లంఘించకుండా గోడలలో నుండి నడవలేను.
ఉల్ఫ్‌గాంగ్ పౌలీ పానకం లో పుడకలా వచ్చి చెడగోట్టాడు గాని లేకపోతేనా ఈ పాటికి అసలు ...
మీరు మీ కాయాన్ని పాశ్చాత్యుడైన
ఫెర్మీగారి ఫెర్మియాన్లతో కాకుండా, మన వారైన
సత్యేంద్ర నాథ్ గారి
బోసాన్లతో నిర్మించుకోగలిగితే ఈ పని సాధ్యం, పౌలీ కూడా మిమ్మల్ని ఆపలేరు. కాని గోడ దాటగానే వెంటనే ఫెర్మియాన్లలోకి మారిపోవడం మరువకండి లేకపోతే చాలా చాలా పెద్ద సమస్యలో పడతారు. ఎవరి సెల్ ఫోన్ లోనే సిఘ్నలై కూర్చుంటారు !!
ఆ విశేషాలు వేరెప్పుడైనా. ఇప్పటికి ఇంత సేపూ శాస్త్రం పేరిట సాగిన ఈ అరాచకం చాలు.
సంగ్రహంనేను గోడలలో నుండి వెళ్ళగలను అని ఎవరైనా అన్నప్పుడు మీరు వెంటనే వారిని ఆ పని ఎలా సాధించారో అడిగి తెలుసు కోని వెంటనే బ్లాగండి. అప్పటి వరకూ నేనూ నా రూంమేట్ మా ఇంటి తాళంచెవి పంచుకోక తప్పదు.
సవాలు పదాలు (వీటికి తెలుగు పదాలు తెలిసిన చెప్ప ప్రార్థన)
Assumptions, elements, periodic table, electrons, protons, neutrons, roommate.