భాషందం, భువనందం, బ్రతుకందం

Friday, September 21, 2007

తెలుగు సినిమా పరిస్థితి ౨ : హ్యాపీ‌డేస్ నిజంగానే వస్తున్నాయా?

ఉపోద్ఘాతం
ఇది తెలుగు సినిమా పరిస్థితి శీర్షికతో వేస్తున్న టపద్వయంలో రెండవది. ఒకటే పెద్దది, వ్రాస్తే మీకు సోదనిపించవచ్చని రెండుగా విడదీయడమైనది. మొదటిది సినిమా పతనం గురించి, రెండవది, దాని పనరుత్కృష్టం గురించి మనము కనగలిగిన కలలకు కల కరాణాల గురించి వ్రాద్దామని నిశ్చయించాను. కానీ అలా చేసిన విభజనలో, నిరాశతో కూడినది ౯౦శాతం, ఆశతో కూడినది ౧౦శాతం గా కనిపించాయి! (దానిలో ఆశ్చర్యపడవలసినదేమీ లేదు). అందుకే రెండు సగాలుగా విభజింజడం జరిగింది. క్రిత టపాకి తరువాయిగా దీన్ని పరిగణించగలరు.

కాపీ రాజులు
నాకు భగవంతుడు పనికిరాని ప్రజ్ఞ ఒకటి పెట్టాడు. అది ఎఁవటంటే, ఒక సినిమాని అరనిమిషం చూసినా అది దేనినుండి కాపీ కొట్టారో, లేద దేనికది కాపీనో చెప్పగలను. మొన్న ఒక రోజు 'ఎ షాట్ ఇన్ ది డార్క్' చూస్తుంటే, అరే ఇది చంటబ్బాయే అని అనుకున్నాను. ఇన్స్‌పెక్టర్ జాక్వస్ క్లసో ని కొట్టడం ఎవరి తరమూ కాదు, మన చంటబ్బాయి తరం అసలు కాలేదు. అప్పటి వఱకూ చంటబ్బాయి మీద చాలా అభిమానవుండేది. కానీ ఆ రోజు, సాంటా క్లాజ్ లేడని అర్థవఁయ్యింది. చంటబ్బాయి పూర్తగా కాపీకాదులెండి, అందులోని చాలా మంచి భాగాలు మాత్రమే కాపీలు. మిగిలిన మెలోడ్రామా అంతా, మన మల్లాది వెంకటకృష్ణమూర్తి గారు రచించిన ఒక నవల మీద ఆధారం. నానా రకాలు కలిపితే కుడిత తయారైనట్టు, రెండు మూడు సినిమాలు కలిపి ఒక తెలుగు సినిమా తియ్యడంచాలా సార్లు జరుగుతుంది. అలాంటిదే ఇంకో ప్రయోగం 'మైఁ హూఁ నా' కి 'ది డిపార్టెడ్' కలిపితే వచ్చిన కషాయం 'ఖతర్నాక్'.

మీకో మలయాళీ మిత్రుడుంటే అడగండి, మలయాళంలో అతి మంచి సినిమా ఏదని? (మలయాళీ స్నేహితురాలుంటే, మిమ్మల్ని పెళ్లిచేసుకోమని అడగండి). చాలా మంది 'మణిచ్చిత్రత్తాೞು' అనే చెబుతారు. దాన్ని తెలగుతమిళాల్లో 'చంద్రముఖి'గా తీసి కంపుచేయడం జరిగింది. అసలు సినిమాలో మోహన్ లాల్ సినిమా సగంలో వస్తాడు, (రజనీలా ముందు వచ్చి మళ్ళీ వెళ్ళడం వుండదు). ఇప్పుడు అదే సినిమాని హిందీలో తీస్తున్నారు. అన్ని హిందీ సినిమాల్లోలాగ ఇందులో కూడా అక్షయకుమారు, విద్యాబాలన్ నటిస్తున్నారు. సినిమా పేరు 'బూలుబులయ్యా'. నాకు మామూలుగా సినిమా ప్రకటన చూస్తేనే అది దేని కాపీనో అర్థమవుతుంది, కానీ ఈసారి అలా జరగలేదు. దానికి కారణం. "హరే రాం, హరే కృష్ణ, హరే కృష్ణ, హరే రాం" అనే పాట వుంది ఆ సినిమాలో. అందులో, నిక్కర్లేసుకున్న ఫారిన్ అమ్మయుల వెనుక భాగం తూగుతూ చూపించబడినది. సినిమా కథకీ, సినిమా లోగోగా వాడుతున్న ఆంగ్ల భూతం బొమ్మకీ, పాటలో భగవన్నామ స్మరణకీ, మారుతున్న దుస్తులకీ, ఆ అమ్మాయిల వెనుకలకూ గల సంబంధం నాకు గోచరించలేదు.

కాపీ కొడితే తప్పేంటి ?
అందరూ అడిగే ప్రశ్న "కాపీ కొడితే తప్పేంటి? ఆఖరున సినిమా బాగుంటే" అని. చాలా తప్పులున్నాయి.
గమనికః హక్కులు కొని సినిమాని తీయ్యడం కాపీకాదు.

నైతికంగా
సినిమాలో కాపీ అనేది సంఘంలో కాపీకి ఒక నిదర్శనం మాత్రమే. ఈవాళ ఆంధ్ర దేశం నైతికంగా ఎంత దిగజారిపోయిందో, తెలియాలంటే, పెద్ద పెద్ద రెసిడెన్షియల్ స్కూళ్లలో, పదో తరగతి పరీక్షల కిచ్చే శిక్షణ గురించి తెలుసుకోండి. కాపీ కొట్టమని చెప్పి మరీ పంపుతారు పిల్లల్ని. అలా ఆఖరుకి ఎవరైతే వ్యవస్థని వంచి, పెడదారి వెంట పిల్లలందరినీ పాస్ చెయిస్తారో వారే ఘనులు. అలా పాసైనోళ్లు, రేపు దొంగ రెస్యూమేలతో అమెరికా ఉద్యోగ వ్యవస్థపై పడతారు, వారే కలక్టర్లు, వారే కాంట్రాక్టర్లు, వారే రాజకీయవేత్తలు, వైద్యులు, ఇంజనీర్లు, ఇంక చెప్పేదేఁవుంది ?
బొట్టూ బొట్టూ కలిస్తే వరదౌతుంది, ఆ వరదలో దేశం మునకెత్తుతుంది.
మన కంపు ప్రపంచమంతా ప్రసరిస్తుంది.

సృజనాత్మకత పరంగా
మన సృజనాత్మకత నుండి జనించిన కళ మనకు మనోరంజనం మాత్రమే కాదు. అది మర్త్యులైన మనము మన భావి తరాలకందించే సంపద. ప్రస్తుతము మన భావితరాలకి "మన ముందు తరాలవారు చేతగాక, ఇతర భాషలనుండి కాపీకొట్టి, మన సంఘానికి దర్పణం పట్టని సినిమాలు తీసార"నే భావం కలిగిస్తున్నాం. అది మీకు సమ్మతవైఁతే "అదృష్టవంతులు మీరు, వడ్డించిన విస్తరి మీ జీవితం".

సంఘానికీ సినీ దర్పణవేఁది
ఈ విషయ ప్రస్తావన మొదటి భాగంలో కూడా జరిగింది. నేటి సమాజంలో జరిగే రీతిలో ఒక్క విషయాన్ని కూడా తెరకెక్కించరు.
సంఘంలో చోటు చేసుకునే మార్పులు, విస్తరించిన అన్యాయాలు, వ్యాపించిన వ్యత్యాసాలు, బురదలోని పందుల మధ్య వికసించిన పుండరీకములు, సాధారణ జీవన అసాధారణందాలు, ధైర్యవంతుల అపజయాలు, మోసగాళ్ల అంతశ్శూన్యాలు. ఇలా ఎన్నింటి మీదైనా తీయవచ్చు. అవేవి లేవు.

కనీసం నిజ జీవితం లో జరుగు విధంగా 'మామూలు మనుషులు ధైర్యం వహించి, చివరకి ఏ ప్రయోజనం లేకుండ మట్టి కఱచిన వైనం' వంటివి కూడా సినిమాలలో లేవు. అలాంటివి తీసినా చూసే వారు లేరు. ఏ కేరళలోనో తప్ప. అక్కడంతా చదువుకున్నవారు కాబట్టి, నిజాన్ని తెరమీద చూడగలరు. తెరమీద నిజాన్ని చూపనపుడు వారు పసిగట్టగలరు.
ఇది మన తెలుగు సినిమా తప్పుకాదు. సంఘం మారే కొద్ది ఇవి కూడా మారతాయి.

మన గొప్ప సంస్కృతినీ, పురాణాలనీ వాడుకుని సినిమాలు తీయడం చేతకావట్లేదు. ఏ మైథాలజీ లేని పాశ్చాత్యులు మాత్రమ పైరేట్స్, హ్యారీ పాటర్ వంటివి విరివిగా తీసేస్తున్నారు.

ఏ లోకాలలో ఉంది కళా
తెలుగునాట ఏకైక కళన్నారు సినిమా. దేనిలోనైనా ఒక్కటి మాత్రమే మిగిలి ఉండండం వల్ల వచ్చే సమస్యేమిటంటే, కొంత సేపటికి ఏమీ లేకుండా పోతాయి!
సమాజంలో వెలసిన కళంటే, ఎవరో కొందరు ఒక నగరంలో కూర్చుని విరచించేది, రాష్టమంతటా దాన్ని చూచి ఆనందించేదీ కాదు. కళంటే, నిత్యజీవితంలో అందరూ పాలుపంచుకునేది. కళ జీవన విధానం. డబ్బు విలువకు సమాజంలో నిలకడైన అభిప్రాయవేఁర్పడినప్పుడు, నిజానందాల వేట ఫలించగా దొరకిన అమృత భక్షణం.
లాటినమెరికాలో అందరూ ఆడే సాంబాసాల్సాలు, హార్లెంలో హిప్‌హాప్, న్యూయార్లెన్సులో జాజ్, మనూళ్ళలో కోలాటం, జపానులో హైకూ పద్యాలు, పాకిస్థానులో షాయరీలు, వియన్నాలో పిల్లవాడు లెక్కలతోబాటు నేర్చుకునే పియానో, కొరియాకెనడాలలోఅమ్మయిలు నేర్చుకునే ఫిగరు స్కేటింగు, ఇంగ్లాండులో యుద్ధయోదులు సైతం నేరిచిన వాల్‌ట్సు!
కళ కనులముందాడేది కాదు. మన మనసులో విరిసేది. ఆగష్టు పదిహేనున టీవీలో చూసే ప్రోగ్రాం కాదు, సంక్రాంతికి వూరి పడుచులు పెట్టే ముగ్గు.

అన్ని సినిమాలూ, కొన్ని సినిమాలు

సమరసింహారెడ్డి
మంచి సినిమా, దీనితో నిర్మాతలకు, ప్రేక్షకాభిరుచుల విశ్వరూప దర్శనవైఁయ్యింది. అప్పటి నుండి ఇప్పటి వరకూ వచ్చిన ప్రతి తెలుగు సినిమాలోనూ దీని ప్రభావం కనబడుతూనే వుంది. ప్రక్షకులకు తమలోని నీచత్వం సంఘమనే అద్దంలో కనిపిస్తున్నది. దానిపై కలిగిన అసహ్యాన్ని హింసతో దులుపేసుకునే ఒక సదుపాయం చూపించిందీ సినిమా. ప్రతి కథానాయకుడు ఈ కథతో ఒక సినిమానైనా తీసాడు. నరసింహ నాయిడు, ఇంద్ర, సింహాద్రి, మాస్, లక్షీ, పోకిరీ... చిన్న చిన్న బదలాయింపులతో (సీమకక్ష్యల బదులు మాఫియా, రాయలసీమ బదులు విశాఖపట్నం).

నువ్వే కావాలి, ఖుషీ
ఈ రెండూ తెలుగు నాట కొత్తగా వచ్చిన 'ప్రేమకీ, అన్నాచెల్లెల్ల సంబంధానికి మధ్య తూగే స్నేహ'మనే కొత్త అంశంమీద తీయబడ్డ సినిమాలు. అప్పట్నుంచి, వేలాది సినిమాలు వీటినుండి స్ఫూర్తి పొందాయి. ఇప్పటికీ కొత్త సినిమాలు, నిజజీవిత యువత యొక్క అంతర్లైంగిక సంబంధాలలోని వైవిధ్యాల కన్నా ఈ రెంటి సినిమాలనుండే ఎక్కువ 'స్ఫూర్తి' పొందుతున్నారు. చిత్రవేఁవిటంటే, ఒకటి మలయాళం నుండి, ఇంకొకటి తమిళం నుండి తీసుకోబడ్డాయి (అది తప్పేంకాదు). ఈ సినిమాలలో తెలుగు విశ్వవిద్యాలయ పంతుళ్లకు సరికొత్త అవతారమివ్వబడినది. విద్యాభ్యాసానికో కొత్త నిర్వచనం ఇవ్వబడినది.

పై రెండిటి ఛాయలూ లేని తెలుగు సినిమా ఈవాళ చాలా అరుదు.

ఇక సూపరు డైరెక్టరు శంకర్ సినిమాలు చూస్తే. జెంటిల్‌మాన్‌కి, శివాజీకి తేడా పెద్దగా ఎఁవ్ లేదు. ఆమాట కొస్తే రామాయణానికీ, శంకర్ సినిమాలైన భారతీయుడు, ఒకేఒక్కడు, అపరిచితుడు వంటివాటికీ పెద్ద తేడా లేదు. అదే ప్రజ, అదే అసుర (రావణుడి బదులు అవినీతి), అదే యుగపురుషుఁడు (రాముని బదులు రజినీ), అదే పూజించే ఆచారం. అమెరికా వ్యక్తిత్వవాదానికి, రష్యా సమానవాదం విరుద్ధం అంటారు. కానీ అవి రెండూ ఒకటే, వాటికి విరుద్ధం, తమలోని రాముని చూడలేని, నేటి భారతీయం. భౌతికవాదానికి, మిథ్యావాదానికీ మన జవాబు సంతృప్తివాదం, సర్దుకుపోదాం.

హ్యాపీ డేస్ నిజంగా వస్తున్నాయా ?
ఆఖరుగా చెప్పుకోదగ్గవి, బొమ్మరిల్లూ, శేఖర్ కమ్ముల.

బొమ్మరిల్లు
నేటి యువత యొక్క మారుతున్న ఆలోచనావిధానం మీద ఆధారపడిన మంచి సినిమా. మొదటి సగం మాత్రం, నేటి తెలుగు సినిమా భుజంగకోరలలో చిక్కుకున్న మూషికమే. అదే వెకిలి కాలేజీ హాస్యం, అదే ఉపాధ్యాయలపై హాస్యం. కాని రెండవ భాగం మాత్రం తెలుగు సినిమా చరిత్ర మొత్తం ఇప్పటి వఱకూ నడిచిన దారిలో వేసిన ఓ ముందడుగు. రేపటి సినిమాలకో దిక్సూచి.

కమ్ముల
తెలుగు సినిమాలో ఎన్నడూ లేని (కనీసం ఈమధ్య కాలంలో), "attention to detail" ని ప్రవేశ పట్టారు. బొమ్మరిల్లు తెలుగు సినిమా నడిచిన బాటలో ముందడుగైతే. ఇది తెలగు సినిమాలకే కొత్త తరం. నాటకాల నుండి సినిమాకి లభించబోయే పూర్తి విముక్తి!

బొమ్మరిల్లు కథా గోదావరి (అదృష్టఁవుంటే హ్యాపీడేస్) కథనం కలిసినపుడు, తెలుగు నాట మంచి సాంఘిక సినిమా అవతరిస్తుంది. కాని చిక్కేవిఁటంటే, వీటిని కాపీ కొట్టలేం. కానీ అయ్యో మన వరికొచ్చిందదొకటేగా !

ఇక హారీ పోటర్, పైరేట్స్ అఫ్ కరీబీయన్ లాంటి సినిమాలు తెలుగునాట తీయ్యాలంటే, దానికోసం, ఇంకో యాభై ఏళ్ల తరువాత ఏ శైలేశ్వరో, దినేశ్వరో వారి బ్లాగులో వేసే టాపా, 'తెలుగు సినిమా దుస్థితి' (౧౦భాగలలో ౭వది) చూడండి.

(సినిమా అనే అంశం మీద నన్నో పుస్తకం వ్రాయమన్నా వ్రాయగలను, ఆ విషయానికొస్తే ఎ అంశం మీదనైనా! కాని మాటలతో ఎఁవౌతుంది లోకంలో?)

కొన్ని ప్రతిసూచనలు (రిఫరెన్సులు)
౧) నేటి సినిమాలలో వికృత పోకడలు - విపరీత ధోరణులు - కాలిపు కూర్మావతారం
౨) Interactivity in Art - కిరణ్ వారణాశి
౩) సంతోషం-మున్నాభాయ్-పోకిరి - వెంకట్ సిద్దరెడ్డి
౪) రీమేక్ సినిమాలు - కృష్ రేం

Sunday, September 16, 2007

తెలుగు సినిమా పరిస్థితి ౧: రోజులు నిజంగానే మారాయి!

ఉపోద్ఘాతము
ఈ మధ్య నేను చాలా టీవి చూస్తునాను. టీవి చూస్తుంటే అందులోని కొత్త సినిమా ప్రకటనలు, 'కామేడి బిట్లు' కూడా చూడాల్సివస్తుంది. కాని నా అంతటనేను ఇష్టపడి చూసే సినిమాలు మాత్రం పాత తెలుగు సినిమాలు, మంచి ఆంగ్లల సినిమాలు. కొత్త సినిమా ప్రకటనలకంటే పాత సినిమాలలోని మెలోడ్రామానే నచ్చుతుంది. దాని బట్టి అర్థఁవవుతుంది, తెలుగు సినిమా నేడు ఎంత అధ్వాన స్థితిలో వుందో. దానికి తోడు మన జానతా అంతా "మన తెలుగు నాట కళలకేం తక్కువ లేదు, ఎన్నో గొప్ప కళలు వెలసిన చోటిది. అలానే, గత యాభై ఏళ్ళగా మనము సినిమాని బాగా పోషించాం" అనడం దయనీయకం. అంటే తెలుగునాట ఇప్పుడు ఎగురుతున్న కళా బావుటా సినిమా మాత్రమే, తోలు బొమ్మలాట, హరికథ, బుఱ్ఱకథ, యక్షగానం అన్నీ సచ్చిన తురువాత, మిగిలిన ఏకైక 'కళ', ఏ పాతాళంలో ఉందో వివరించడానికీ టపద్వయం.

తండ్రి నుండి తనయుని వఱకూ
ఈ మధ్య పాత తెలుగు సినిమాలు టీవీలో వచ్చినవి వచ్చినట్లే చూసేస్తున్నా. వాటిలో మొన్న వచ్చిన, నాకు చాలా నచ్చిన సినిమా, 'నేరము శిక్ష'. ఈ కృష్ణ సినిమా ఇప్పటికి నాలుగైదు సార్లు చూసా. చాలా చాలా మంచి కథ, చలా మంచి కథనం. ధర్మానికీ అర్ధకామాలకీ మధ్య జరిగే సంఘర్షణలో మానవులు పావులై, తమతో తాము ఆడుకునే ఆటలో నుంచి, తీయబడ్డ మూడుఘంటల మంచి నమూనా. ఆనాటి సంఘానికో మంచి ప్రితిబింబం. కథ అష్టవంకర్లు తిరగకుండా దాని మూలం చుట్టూ చాలా బాగా తిరుగుతుంది. నటనలో నాటకీయం ఉన్నా అది అప్పుడే నాటకాలనుండి విడిపోయి, సినిమా తనకంటూ ఒక ప్రత్యేక శైలిని సమకూర్చుకుంటున్న రోజులు కాఁవట్టి. క్షమించవచ్చు.
అది ఆనాటి సినీతత్వం మాత్రమే.


దానితో పోల్చనున్నాం, ఈనాడు తెలుగు నాట అతి సంచలనం సృష్టించిన సినిమా, పోకిరి! నా బ్లాగు లో ఈ సినిమా ప్రస్థావించినందుకు ఇప్పుడే పశ్చాత్తాప పడుతున్నాను. రంగుల తెర, అద్భుతమైన గ్రాఫిక్సు, కొట్టీ కొట్టని బీట్లు, దాగీ దాగని వళ్ళు. హూఁ! సినిమా అంతా మతి లేని, హింసాఖాండ, నిజ జీవితంలో వీలు కూడా కాని విన్యాసాలు, తెలుగు రాని అమ్మాయిలూ, నటన అంతకన్నారాని నటీనటులు, పాటులు చెండాలం, కథ చెండాలం. ఇలా ఇంకా ఎంత కాలమైనా చెప్పుకు పోవచ్చు. ఎప్పుడూ ఒకేరకంగా విసిగేత్తినట్టు ముఖాఁన్ని పెట్టే కథానాయకుడు. చీమల మందలా ఒకడు చచ్చిన తరువాత ఇంకో విలను వస్తూనేవుంటాడు.
'నేరమూ-శిక్ష'నీ, ఈ సినిమాని ఒకే వాఖ్యంలో ప్రస్థావించడం కూడా పాపమే.

సంభాషణలు
మొన్న చూసిన ఒక సినిమాలో కైకాల, తన కొడుకులను మట్టి కఱిపించవద్దని నందమూరిని బ్రతిమాలడానికి వచ్చి,
"నీవు నా కొడుకువే బాబూ, తమ్ములని చంపొద్దు, ఆస్తి నీదే నువ్వే తీసుకో" అని నచ్చజెప్పడానికి ప్రయత్నిస్తున్నాడు.
"నా మీద నీకు ఎటువంటి మమకారమూ లేదు, నీ ప్రియ కొడుకులని రక్షంచుకోడానికి కుంతీ రాయబారానికి వచ్చావా?" అంటాడు తారక. అలా కుంతీ రాయబార రూపకంగా వేడిగా సంభాషణ జరుగుతుంది.
అలా రాయబారం విఫలఁవైం తరువాత, పోతూ పోతూ కైకాల,
"ఏ శాస్త్రమూ పని జేయనప్పుడు, పెద్దలు కౌటిల్యుడి రాజ నీతి తియ్యమన్నారు, అందులో బంధాల గురించి, ప్రీతి గురించి, ఎక్కడా ప్రస్థావన లేదు. ఇక ఆ పుస్తకం తెరవాల్సిందే, ఆ తురువాత నువ్వు కన్న కొడుకువని కూడా లెక్క చెయ్యను . ఖబడ్దార్." అన్న సారంశం ఉన్న డైలాగు చెప్పి నిష్క్రమిస్తాడు.

ఇక ఈనాటి పరిస్థితి
"ఎవరు డైలాగ్ కొడితే, దిమ్మదిఱిగి, మైండు చెడుపోయి, వాంతి వస్తుందో వాడేరా ఈనాటి తెలుగు సినీ నాయకుడంటే" అన్నట్టుంది!
నిన్ననే 'ఆడువారి మాటలకు అర్థాలే వేరులే' అన్న సినిమా చూస్తున్నా, అందులో ప్రేమ అనే పదం గాని జీవితం అన్న పదం గానీ ఎక్కడా వాడలేదు. (ఆ సినిమాలో మిగిలిన అంశాలతో పోల్చుకుంటే ఇది ఒక మంచి అంశంగా పరిగణించవలసి వస్తుందన్నది వేరే విషయం). ఈనాటి రచయితలకి వచ్చిందల్లా ఓ కొజ్జా భాష! అందు వ్రాయగలిగినోడే ఘనుడు.


పరిశోధన (దర్శకత్వం)
సినిమా తీస్తే, దాన్ని ఏ కాలస్థలాల నేపధ్యంతో తీసారో వటిని బాగా పరిశోధించి కథలో, కథనంలో వాటిని బాగా ఇమడ్చాలి. కన్యాశుల్కం తియ్యడానికి అఱవై సంవత్సరాలు వెనక్కి వెళ్ళాల్సొచ్చినా, మోసగాళ్ళకి మోసగాడుకి (కథలో, స్కిరిప్టులో) ఖండాతరం వెళ్ళాల్సివచ్చినా వెళ్లేవారు. అదే ఈవాళ ఏ వెంకటేశ్ సినిమా తీసుకున్నా, అందులో అదే వైజ్ యాస్ వ్యాఖ్యలు. ఎప్పుడూ హీరోదే ఆఖరి మాట. అన్ని సినిమాలలోనూ, అదే మాట్లాడే తీరు. బిఎ ఫెయిలైనా కోనసీమ కుఱ్ఱాడైనా, చాలా సమర్థుడైన కంప్యూటరు ఇంజనీరైనా, ఒకటే మాటచందం. అన్ని పరిశ్రమలలో జనాలు మసులు తీరు సినిపరిశ్రమలో లానే ఉంటుందని వారి సౌకర్యార్థం తప్పుగా అనేసుకోవడం.

అలానే రాయలసీమ నేపధ్యంగా కథ సాగుతున్నప్పుడు రౌడీలు రాయలసీమ యాసతో మాట్లాడతారు, కానీ కథానయకుడు మాత్రం 'ఉత్తమఁవైన' బెజవాడ తెలుగులో మాట్లాడతాడు. ఈ విషయంలో మన 'అఆ రెడ్డి', 'ఉఊ నాయిడు' సినిమాలకంటే, ఆరవం నుండి అనువాదించిన 'పోతురాజు' వంటి సినిమాలు చాలా మెఱుగు. సగం సినిమాలు హైదరాబాదులో జరిగినవిగా తీస్తారు. కానీ తెలంగాణ మాండలికం ఉండదు. కథానాయికలందరికీ డబ్బింగు చెప్పే కళాకారిణులు పరిశ్రమ మొత్తానికీ, ఐదాఱుగురుంటారు. వారిని కూడా ఎవరు ఎక్కువ నత్తి నత్తిగా మాట్లాడతారు, ఎవరు ఇప్పుడే అమెరికా నుండి దిగారు అన్న కొలమానులతో కొలచి ఎంపిక చెయ్యడం జరుగుతుంది. ఇక యమదొంగలో చిత్రగుప్తుడు బుక్కు బుక్కు అనడం విచారకరం.

కథానాయికలు
జమునా, విజయకుమారి, శారద, వాణిశ్రీ లాంటి వాళ్ళ ముందు, ఈనాటి కథానాయికలు (వారి పేరు చెప్పి బ్లాగు శీలం చెడగొట్టలేను) తలెత్తుకుని నిలువగలరా? వారిలో ఉండే వయ్యారం, నడక, నాట్యం, నటన, భాషాప్రావీణ్యం? "అప్పటి కథానాయికల నుండి ఆశించేది వేరు, ఇప్పటి కథానాయికలకు గ్లామరు చాలా ముఖ్యం, పైగా నాటకీయంగా ఉండే నటన కూడా సహజ నటనగా మారింది" అని మీరు వాదించినా. జయసుధ, విజయశాంతి లాంటివారు కూడా లేరుగా ఈనాడు. వాణిశ్రీలాంటిది పిచ్చిదానిగా చేసిందంటే, కృష్ణంరాజు వంటి వారు కూడా ప్రధాన పాత్రనుండి ద్వితీయ పాత్రకి వెళ్ళవలసిందే. ఈనాడు చిత్ర'మందిరం' నుండి బయటకు వచ్చిన వారిని 'దేవి' పేరు చెప్పమంటే చెప్పలేరు. తెలుగంటారా రానేరాదు. ఇక అప్పుతెచ్చుకున్న కథానాయికలలోనైనా భానుప్రియ, శోభన వంటి వారైనా ఎక్కడ?

ఈనాటి సినిమా హీరోయిన్ల ఎంపికా ప్రక్రియ నాకు అస్సలు అర్థంకాకుండా ఉంది. స్త్రీసమానత్వవాదానికి తెలుగు కథానాయికల పతనం వెన్నులో ఒ పోటు.

కథానాయకులు
వీరి పతనం కంటే వీరి వల్ల మిగిలిన అంశాలకు జరిగిన పతనఁవే ఎక్కువనాలి. రామారావు, నాగేశ్వరరావుకీ ఈనాడు సరిసాటి లేరన్న విషయం అటుంచితే. ౪౦లలో నాయకులు కథలో భాగంగా ఉండేవారు, ౭౦లకల్లా కథకన్నా పెద్దవారిగా చెలామణీ అవ్వడం దురదృష్టకరం.
నిజంగా దిగజారింది, 'కలసి వుంటే కలదు సుఖం'లో రామారావు, 'దేవదాసు'లో నాగేశ్వరరావు! ఇక కమలహసన్, రాజేంద్రప్రసాద్ వంటి వారు కనుమఱుగే!

సంగీతం
నిజం? దీని గురించి వ్రాయాలంటారా?
సంగీతఁవనేది ఒక ప్రత్యేక కళ. ఇది సినిమాలో భాగం కాదు. కాబట్టి 'తెలుగునాట సంగీతం' గురించి ఒక ప్రత్యేక టపా వెయ్యాలి.
ఒక్క నిఁవిషం! తెలుగునాట వెలసిన ఏకైక కళ కదా సినిమా? నా మతిమఱపుమండా! ఇక మనము సంగీతం వంటి వాటి గురించి మాట్లాడడం నిరర్థకం. ఆఃక్లాండులో నల్లవారి ఆకలి కేకల నుండి పుట్టిన హిప్‌హాప్‌ని మనదిగా వాడేసుకుంటే పోలే. అది సరిపోకుంటే, లెటీనో సాల్సాలు, అరబీ పాటలు ఉండనే ఉన్నాయిగా. అది కూడా కష్టమైతే తోటి తెలుగు వాడే మళయాళ సినిమాలో కొట్టిన పాట ఉండనేవుంది. సామెత చెప్పినట్టు వండుకున్నవాడికి ఒక్క కూరైతే అడుకున్న వాడికి అఱవైయ్యాఱు కూరలు.


ప్రేక్షకమహాశయులు
"అలా ఐతే ఈ సినిమాలు ఇంత పెద్ద హిట్లెందుకవుతున్నాయి? జనాలు వెఱ్ఱాళ్ళనా మీ ఉద్ధేశం?"
వెఱ్ఱాళ్ళే కానీ అది వారు తప్పు కాదు. ఉండండుండండి. ప్రజాస్వామయం కదా, అయితే అన్నీ ప్రజల తప్పులే! వారి వెఱ్ఱతో సహా! కానీ ఆ అంశంలోకి పెడదారిన వెళ్ళక నవీన సినిమా ఎందుకు అంత విజయం పొందిందో చెప్పుకుందాం.

నేటి భారతీయులు, అన్ని విధాలాల విసుగెత్తి వున్నారు. అనినీతీ, న్యాయంలేక పోవడం, ఎవడు రౌడీలను మేపగలిగితే వాడిదే రాజ్యం, చేతగానితనానికి మారుపేరుగా నిజాయితీ. దాని మీద, ఎప్పుడూ నీడలా వెంటాడే మధ్య తరగతి భవసాగరాలు. ఏఁవైనా సాధిద్దాఁవను కుంటే అడ్డంకులు! లంచం, రాజకీయాలు, బందుప్రీతి, కుంభకోణాలూ, మీకు తెలియనిదేముంది? ప్రతి సినిమా హీరో వీటిగురించేగా వా'పోయేది'. వీటన్నిటి తలదన్నేలా, ప్రొద్దుట లేచి, రాత్రి నిద్రపోయేవరకూ, కనిపించే లక్షలాది మందిలో ఒకరు, అంటే ఒక్కరు కూడా తనకు గౌరవం ఇవ్వరు. అంతే! తమెవ్వరికీ ఇవ్వని గౌరవం తమకి దక్కాలనే తాపత్రయం.

అదే సినిమాకెళ్తే, హీరోకి అడ్డు వచ్చిన రౌడీని నరికి పారేస్తున్నాడు, చిరంజీవిని ఎవరూ ఎప్పుడూ చీదరించుకోరు, కొట్టరు. రజనీకాంత్ వచ్చి నల్ల డబ్బుని తెల్ల డబ్బుగా మార్చేస్తున్నాడు, "ఒహో అవినీతిని అరికట్టడం మన బాధ్యత కాదన్నమాట, బెదరని వాడు రాలేరాలేరాలేదు, కాబట్టే అది ఉంది". సినిమాలు మనోరంజనంతో పాటు మనం చెయ్యగలిగినదేఁవీ లేదనే 'మనోలంజనం' కూడా కల్పిస్తున్నాయి.

ఇక హీరో చేత తన్నులు తన్నించు కుంటున్న స్టంట్‌మెన్, సినిమా రౌడీలూ మనుషులుకారు, ప్రేక్షకుని నిజజీవితంలోని అడ్డంకులకు వెండి తెరపై రాతి ప్రతిబింబాలు. వాటిని హీరో చిత్తు చిత్తు చేస్తున్నాడు, మన ప్రేక్షకులు నిజజీవితంలో ఆశించినట్లే! అది సినిమా కాదు, ఒ ఫాన్టసీ, చాలా సుదూర ఫాన్టసీ. అది కళాభిమానం కాదు, మానసిక హస్తప్రయోగం (ఎమోషనల్ మాష్టర్బేషన్).

తరువాయి
తెలుగు సినిమా పరిస్థితి ౨ : హ్యాపీ‌డేస్ నిజంగా వస్తున్నాయా? (కాపీ రాజులు, సంఘానికీ సినీ దర్పణఁవేది, హైజాకైన కళ, హ్యాపీ డేస్ నిజంగా వస్తున్నాయా, వగైరా)
మనవిః అచ్చు తప్పులు మన్నించగలరు

Thursday, September 13, 2007

తెలుగు లందు నాది తెలుగు లెస్సు

ఉపోద్ఘాతము
మీరు ఎఁవిటి ఇతను, ఱ, అఁ, ఋ, ఌ, ఞ వంటి వాటిని తఱచూ వాడుతుంటాడు అని విచారించువారైతే, మీ ప్రశ్నలకు ఇదే ఋఌల చందంలో సమాధానం.

అశళు ఠఫా
ఱాణాఱె, థణ శ్కూళు ఱోఝుళ ఘుఱింఛి వ్ఱాశి, అబిణవ ణావిఁణీ సుబ్ఱమన్యం ణాయిఢి ఘా ఫేఱుఫొంధాఱణ్ణధి తెలుగు భ్ళాఘఱ్ళంధఱిఖీ థెళిశింధే. ఆళాణే ఛాళావఁంధి ఇథఱ భ్ళాఘఱ్ళు ఖూఢా థమ తెలుగు ఫ్ఱథాఫం ఛూవింఛి, ఎణ్ణో మెఫ్ఫుళూ ముఢుఫుళూ ఫొంధాఱణి ఖూఢా ణాఖూ వీఁఖూ ఖూఢా థెళుశు.

ణేణు అశువఁంఠి ఫణుళు సెయ్యళేఖ ఫోయిణా, ఛాళా అబివఌద్ధి ఛెంధా, ణా తెలుగు ఛాళా ఫుఱోఘమణం ఛెంధిఁవ్ధంణి ఖూఢా ణేణు ఘఱ్భంగా జెఫ్ఫుఖో ఘళుఘుథుణ్ణా.. ఖాణీ ఈభేల ణాఖు ఖూఢా ణా శ్ఖూళు ఱోఝుళు వళ్ళ ఓ ఠఫా ధొరిఖింధి.

ఖత ఎఁవఠంఠే..
ణేణు మ్యావూఱి థెఱఫిష్టు (అధేణంఢీ మాంథ్ఱిఖుఁఢు) ధఘ్ఘఱఖి వెళ్ళిణఫ్ఫుఢు, అథణు జెఫ్ఫాఢు,
"ణిఝంఘా ణీ తెలుగు ఛాళా భాఘుంధణి అఁధఱూ ఖోణియాఢాళంఠే, అధి శాధ్యఁవయ్యే విసయఁఘాధు. ధాణి భధుళు, ణువ్వు అళా ఫఖ్ఖ వాఱి మెఫ్ఫు ఖోశం ఫ్రయథ్ణిశ్థుణ్ణావంఠే, ధాణిఖి ఏధో, మాణశిఖ ఖారణఁ ఉంఢి ఉంఠుఁధి, అంధుఖే ణీఖా అబద్ఱథ" అణి ఖూశింఢు.

ఇంఖో ణాళుఘు, ఱొఝుళ థర్వాథ మల్లా ఖళశిణఫుఢు ఆ థెఱఫిష్ఠే అణ్ణాఢు,
"ణుబ్బు ఛిణ్ణఫ్ఫుఢు, అణ్ణి సధువుళళోణూ ఱానింఛిణా, తెలుగులో మాథ్ఱం థఱఘథి మద్ది ళోణే, మామూళు భిధ్యాఱ్తి ళాఘా వుఁంఢి ఫోయాబ్, ఆ ఖొఱథే, ణిణ్ణు ఇళా బెఁటాఢు థుంధి" అణి ఖూశిండు.

థాఙిఖి ఇఱుఘుఢేవఁణి యఢిఘిథే, ఫఖ్ఖనే బున్న మాబూఱి తెలుగు ఫంథుళు, ఛెఫ్ఫాఱు, సుధ్ధ తెలుగు మాఠ్ళాఢఁవణి.
" ఎబఱూ బాఢణి, అఖ్సఱాళు వాఢు", అభి ఎభణఘా "వథ్థుళ్ళున్న అఖ్సఱాళు, ఖ,ఘ,ఝ బంఠిబీ. వఁరియూ ఱ,ళ, ఙ, ఞ, ఌ,ౡ,ఋ, ౠ, అఁ, బంఠిబీ. ఎఖ్ఖఢ బాఢాళో అఖ్ఖఢ థఫ్ఫఖ భాఢు" అణి షెళవిఛ్ఛాఱు.

అంధుఖే ణా భ్ళాఘుఖి "రి,రీ,లి,లీ" అణిఫేఱు ఫెఠ్ఠఠఁవైంది. కన్యాశుల్కం భంఠి మంఛి ఫ్ఱాఛీణ ఘ్ఱంతాళు ఛధిభి, భాఠి ణుంఢి, అఁ వఁఠిభి ఎఖ్ఖఢ భాఢాళో థెళుశు ఖుణ్ణా..

ఆటవెలది (రెండో అర్థములో)
ౠఋ ౡఌ వంటి వేలనియన్నను
యాభదాఱు వున్న యా తెలుంగు
అక్షరాల యందు, అరుధక్షరాల్ వేరు
తెలుగు లందు నాది తెలుగు లెస్సు
రాయలవారికీ, వేమన గారికీ, అంబానాథ్ గారికీ , క్షమాపణలతో... యతి, ప్రాసలకు సదా విధేయతతో... ఈ టపా నిమిత్తం అనామికులైన గురువుల స్మరణతో...

Saturday, September 08, 2007

టిర్కీ త్రిమూర్తులూ

ఉపోద్ఘాతం
టిర్కి ఎవరా ?
మీరసు ఏ లోకంలో ఉంటారు ? ఇవళ రాత్రి టీవిలో ఆటలు చూడలేదా
చూసామే.
ఐతే టిర్కీలు తెలియక పోవడమేమిటి.
క్రికెట్ టీములో అలాంటివారెవరూ లేరే.
క్రికెట్టా? హాకీ ఉండగా అడ్డమైన చెత్త చూడొద్దన్నానా ?
అదీను ఆసియా కప్పు సెమీ ఫైనల్లలో, పాకిస్థాన్ తల దన్నిన జపాను తో భారతం పోరు పడుతుండగా.
ఐనా టిర్కీలు తెలియని వారితో నాకు మాటలేంటి ? మీరు తక్షణమేనా బ్లాగు విడిచి పొండి. మీ పేరుతో ఒ చదువరి నా బ్లాగుకే లేరనుకుంటాను, అలానే నా బ్లాగుకు మీ రెన్ని సార్లు వచ్చారో చెబితే, నా సందర్శకుల లెక్క నుండి అంత తీసివేస్తాను.
ఎఁవిటీ అలా ఐతే, నా సందర్శకుల సంఖ్య సున్నా అవుతుందా? అయితే అవుతుంది.
బాబ్బాబు ఇంకో మాట చెప్పు.
సరే ఐతే, రేపు ఆసియా కప్పు ఫైనలు వస్తుంది. భారతం దక్షిణ కొరియా తో తలపడనుంది. పశ్చాత్తాపంగా అది చూడండి ఐతే. ఇంకా వివరాలు కావాలా.

ఆసియా కప్పు
ఆసియా దేశాలు ఆడే హాకీ టూర్నమెంటు. పాల్గొన్న దేశాలు
పూలు ఎ - పాకిస్థాను, మలేషియా, జపాను, సింగాపురం, హాఙ్ కాఙ్
పూలు బి - భారతు, కొరియా, చైనా, థాయిలాండ్, శ్రీలంకా, బాంగ్లదేశం

అందులో మంచి టీములు - మనం, పాక్, కొరియా, మలేషియా,
ఫర్వాలేదు జట్లు - చైనా, జపాను, (రెండూ ఈ మధ్యనే పైకి వచ్చాయి), హాఙ్ కాఙ్ కొంత వరకూ పర్వాలేదు.
చెత్తవి - మిగతావి

లీగు ఆటలు
పూలు బీ లో భారత్ ఓటమి ఎరుగదు, కానీ చైనా కొరియాల మీద కష్టపడి నెగ్గుకొచ్చాం.
పూలు ఎ లో అందరూ గొప్ప జట్టుగా కొలిచి, విశ్వ హాకీ రాంకింగులో మిగతా ఆసియా జట్ల కంటే మంచి రాంకింగు ఉన్న పాకిస్థాన్ని జపాను అనుకోకుండా ఓడించడంతో, వారు సెమీస్ కి రాలేదు. భారత్ శ్రీలంకను ౨౦ లక్ష్యాలతో, థాయిని ౧౬ లక్ష్యాలతో చిత్తు చేసింది.

సెమీసు
భారత్ x జపాను (భారత్ నెగ్గింది)
మలేషియా x కొరియా (కొరియా నెగ్గింది)

ఫైనల్సు భారత్ x కొరియా రేపు ఆదివారం సాయంత్రం ౬:౩౦ (ఆరున్నరకు).

ఇక హాకీ గురించి
౧) గోలు దూరం నుంచి కొడితే చెల్లదు, ౨౦ గజాల దూరం లో ఉన్న D (అరవృత్తం) లో ఆటగానికి కఱ్ఱకి కనీసం తాకి లోని కెళ్తేనే చెల్లుతుంది.
౨) కాలుకి బంతి తగల కూడదు, తగిలిన అది అవతలి జట్టుకు ఇవ్వబడును (free hit)
౩) D లో రక్షణ ఆటగాడి కాలుకి తగిలిన, అవతలి టీంకి penalty corner ఇవ్వబడును, అవి హాకిలోనే అతి ఉత్కంఠ మైన క్షణాలుగా చెప్పవచ్చు.

మిగలిన ఆట మామూలుగానే ఎవరి లక్ష్యాం లోనికి వారు బంతిని పంపించడానికి కృషిచేస్తారు.

మన జట్టు
ఇంతకీ ఈ టిర్కీలెవరా
ప్రభోద్ టిర్కీ - జట్టు సారథి, మైధాన మధ్యలో ఆడతాడు.
ఇగ్నేశ్ టిర్కీ - ప్రభోద్ తమ్ముడు, ఆక్రమణ పంక్తి లో భాగం
దిలీప్ టిర్కీ - రక్షా పంక్తి లో ముఖ్యుడు, ప్రపంచంలోనే అతి మంచి హాకీ రక్షకులలో ఒకడు. జట్టుకు సారథ్యం కూడా వహించాడు. ఇతనిని ముద్దుగా 'గోడ' అంటారు.
(టిర్కీ ఒరిస్సాలోని కొండ జాతులలో ఇంటి పేరు, వీరు వీర హాకీ ఆడతారు. నా పాత రూమ్మేటు టొప్పో కూడా ఈ కోవకి చెందిన వాడే. చాలా గట్టి మనిషి, రాయి అని పిలుచేవారం మేము. హాకీ చాలా బాగా ఆడేవాడు. ఇక పంజాబు, కొడగులలో కూడా హాకి అంటే ప్రాణం )
ప్రభ్‌జోద్ సింహ్ - ఆక్రమణ పంక్తి మధ్యుడు. ఇతని దగ్గరకి బంతి వచ్చిందంటే, మీరు కుర్చీనుండి లేచి కూర్చోవాల్సిందే.
రఘునాథ్ - ఇతను ఎక్కవగా పెనాల్టి కార్నర్లను కొట్టే వ్యక్తి, ఇతను substitute అయిపోతే, దిలీప్ టిర్కీ కి పెనాల్టీ కార్నర్లు ఎక్కువా అప్పజెప్పుతారు.
ఇంకా ఇతర మంచి ఆటగాళ్ళు - శివేంధర్ సింహ్, తూషార్ ఖాండేకర్, రాజ్ పాల్ సింహ్, బల్జీత్ సింహ్ (గోలీ) వగైరా.

కొసమెఱుపు
మీరు ఇంకా సంకోచిస్తున్నారంటే, హాకీ గురించి వేదాలలో ఏఁవ్ రాసుందో వినండి.
ధీరులు హాకీ ఆడతారు
రసజ్ఞులు ఫుడ్‌బాలు ఆడతారు
హాకీ అతివేగ, అతిప్రమాదకర, అతి అలసట కలిగించే క్రీడలలో ప్రథమం. అలా అని ఇది నాన్-కాంటాక్టు ఆట. వెధవ వేషాలు చెల్లవు. ఇంకేముంది ఐతే, రేపు సాయంత్రం ఆరున్నరకి డిడి క్రీడల టీవీలో చక్కదే, ఒహ్ చక్కదే ఇండియా అనుకుంటూ ఆసియా కప్పు ఫైనల్సు చూడండి.

చక్కుదే అంటే గుర్తొచ్చింది, మన ఆడ వారి జట్టు ఎం చేస్తుందో హాఙ్ కాఙ్ లోని మహిళల హాకీ కప్పులో, ఈ పాటికి నగ్గేసుండాలి, క్రిత విజేతలు మరి. ఇప్పుడే అందిన తాజా వార్త మన అందగర్తెలు(అన్నట్టు సినిమాల్లో చూపించనంత అందంగా ఐతే నిజమైన భారతీయ హాకీ క్రీడాకారిణులు ఉండరు) సెమీస్ లో కొరియా చెతిలో ఓడారు. చక్కదే అంటూ సినిమాలు చూడడం కాదు అస్సల్ సినిమా యాడాడతుందో ఆడ సూడాల్న. మీరెప్పుడైనా ఆడవారి హాకీ చూసారా, ఎ జెర్మనీ ఆస్ట్రేలియా ఆటో చూడండి, నా లాంటోళ్ళిక ఇలాటి బ్రతిమాలుకునే టపాలు వ్రాయక్కరలేదు. ఎందుకంటే, మహిళల హాకీ ప్రపంచంలోనే అతివేగ, అతిప్రమాదకర, అతి చిన్న స్కర్టు వాడే క్రీడలలో ప్రథమం. ;-)

Thursday, September 06, 2007

విశాలాంధ్రలో చివరకు కొన్న పుస్తకాలు

మొన్న విశాలాంధ్రకి వెళ్ళి వచ్చా, హజ్ కి వెళ్ళోచ్చినంత పనైంది. అనుకున్న రెండు నెలలకి వెళ్ళగలిగా. కానీ ఆలస్యం అవడమే మంచిదైంది. అంతకు ముందుంన్న జాబితా కంటే మంచి జాబితా తో వెళ్ళ గలిగా. హైదరాబాదులో బస్సెక్కి వెళ్ళడమంటే ఆషామాషీ కాదని అందరికీ తెలిసిందే. బస్సు ఎక్కే ముందూ, ఎక్కినతరువాత, దిగిన తరువాత ఒక వంద సార్లు తిట్టుకున్నా నగరాన్ని. ప్రపంచంలోని అతి చెత్త నగరం బహుమతి కూడా ఇవ్వడం కూడా జరిగింది. సీరియస్‌లీ మరీ ఇంత అద్వాన రవాణా వ్యవస్థా ? ఏదేమైనా, వెళ్ళి రావడం గురించి వ్యంగ్యంగా దురుసుగా ఒ టపా వ్రాయొచ్చు, కానీ ఆ పుస్తకాలు కొన్న అనుభూతి బీరు తాగినంత కన్నా గొప్పగా అనిపించింది. కాబట్టి దాని మీదే ధ్యాస పెడదాం.

నేను కొన్ని పుస్తకాలు జాబితా
  • చివరకి మిగిలేది (బుచ్చి బాబు) ౯౦ (90)
  • గణపతి (చిలకమర్తి) ౬౦ (60)
  • కృష్ణపక్షము (కృష్ణ శాస్త్రి కవితలు) ౩౦
  • అసమర్ధుని జీవయాత్ర (త్రిపురనేని) ౪౦ (40)
  • కన్యాశుల్కం (గురజాడ) ౭౦ (70)
  • ఎకైక విప్లవం (జిడ్డు) ౧౨౦ (120)
  • మహాప్రస్ధానం (శ్రీశ్రీ) ౪౦
  • అమృతం కురిసిన రాత్రి (తిలక్) ౭౦
  • దర్గామిట్ట కతలు (ఖదీర్ బాబు) ౬౦
  • సలాం హైదరాబాదు (లోకేశ్వర్) ౯౯
  • మాలపల్లి (ఉన్నవ లక్షీనారాయణ) ౧౫౦ (150)
  • భారతంలో చిన్ని కథలు (ప్రయాగ రామకృష్ణ) ౧౫౦
  • అంపశయ్య (నవీన్) ౯౮ (98)
  • ఎంకిపాటలు (నండూరి సుబ్బారావు) ౨౫
మొత్తం వెల ౧౧౦౨ (తగ్గింపు ౧౦౨) = ౧000 .
అదన్న మాట మొత్తం వెయ్యి రుపాయలు, మామూలుగా అయితే, "ఇంకొంచెం తగ్గిస్తే మా స్నేహితులకు మీ కొట్టు పేరు చెబుతా" అని సోది కొట్టి ఇంకొంచెం బేరం ఆడే వాడిని (కాలీకట్‌లో ఆరీసీ అంటే పది శాతం తగ్గింపు ఇచ్చేవారు అన్ని చోట్లా). మా నానమ్మ దగ్గర నుండి వారసత్వం వచ్చిన ఏకైక గుణం - బేరాలాడడం. కానీ మొన్నటి దాకా ఆమెరకలో అడ్డమైన ఇంజనీరింగు పుస్తకాలు తలా ౧౫౦ డాలర్లకు కొని, ఇక్కడేమో పద్నాలుగు ఆణిముత్యాలకు వెయ్యే ఇచ్చా. ఇలా ఐతే తెలుగు సాహిత్యం ఎలా ముందుకు సాగుతుంది అని దిగులు పడ్డా. తగ్గింపు ఇవ్వకపోతే బాగుండును అనిపించింది. అభిమానం దుఃఖించినా, పేదరికం సంతోషించింది.

కొట్టలో కొన్న తీరు
సాహిత్యం గుంపులో చదవవలసిన పుస్తకాలు కొన్ని చెప్పమంటే, చాలా మంచి సూచనలు ఇచ్చారు, కానీ అందులో చాలా వరకూ కథల పుస్తకాలే ఉన్నాయి. ఆ తరువాత త్రివిక్రం గారి టపాలో మంచి నవలలు చూసి వాటిని కూడా నా లిస్టులో జేర్చి మరలా సాహిత్యం గుంపుకి పంపా, అందులో ఇచ్చిన సవరణలతో రెండవ కూర్పు తయారుచేసి దానిని ముద్రించి నాతో పట్టికెళ్ళా .

దుకాణానికి వెళ్ళిన తరువాత, బ్రౌజింగ్ మొదలెట్టా, ఎంత సేపున్నా ప్రయోజనం పెద్ద లేక పోయింది. ఒకతను నా చిట్టా చూసి, దాన్ని అందుకొని, చాలా మంచి పుస్తకాలు వ్రాసుకొచ్చారండి, అని ఒ పది సార్లు పొగిడి, ఒక దాని తరువాత ఒకదాన్ని కౌంటరు మీద పెట్టడం మొదలు పెట్టారు. అలా నా ముందు ఒ మూడు నాలుగు వెలు చేసే పుస్తకాలు పెట్టాడు. వాటిలోనుంచి, నాకు కావలసినవి ఎంచుకున్నా, క్రింద వివరించబడిన పద్ధతిలో.

కొనని పుస్తాకాలు
వెయ్యి పడగలు కొందామనుకున్నాకానీ మరీ ౪౦౦ అనేసరికీ వెనకాడింది నిరుద్యోగం. అలానే ఇంకా చాలా మంచి పుస్తాకాలు ప్రింటు బాలేదని కొనలేదు అందులో ఒకటి 'నవ కవితా సంకలనం'. అలానే భాగవతాన్ని కూడా నాలుగొందలనే సరికి, 'అన్నంముట్టించగానే ఆవకాయెందుకు' అని నిర్జీతం వాదించింది, వాదనలో గెలిచింది. కాని గట్టి బైండింగుతో చాలా బగున్నాయి భాగవతం రెండు పుస్తకాలు. వారి దగ్గర అముక్త మాల్యద లేక పోయే సరికి, కావ్యాలేవి కొనలేకపోయా.

నామిని కథలు కొందామనుకున్నాకానీ, ఒక పేజీ చూసా, రాయలసీమ మాండలికం, నాకేమో తెలుగు చదవడం అంత వేగంగా రాదు. రానారె వ్రాసినవే ఆయన దగ్గరుండి (జీటాక్‌లో) చదివిస్తే గానీ అర్థం కాలేదు. కాబట్టి వాటి బదులు దర్గామిట్ట ఎంచుకున్నా. అదీను ముస్లిం సాహిత్యం కూడా కొన్నట్టుంటుంది, ప్రింటుకూడా బాగుంది! అలానే మధురాంతకం కథలు, అత్తగారి కథలు కూడా కొనలేదు. సలాం హైదరాబాదులో కూడా ప్రింటు చాలా బాగుంది, అందుకే తీసుకున్నా. కొడవటిగంటి 'బెదిరిన మనుషులు', 'బ్రతుకు భయం' కొందామంటే రెండూ లేవు. 'చదువు' కొనాల్సిందేమో, ఎందుకో కొనలేదు.

అతను లిస్టులో ఉన్న 'అంపశయ్య' మరచిపోయాడు కానీ తరువాత ఊరికినే బ్రౌజు చేస్తుంటే తగిలింది. అలా తగిలిన మంచివి, 'ఎంకి పాటలు', 'కన్యాశుల్కం'. కొట్టతను 'భారతం లో చిన్ని కథలు' చాలా బాగుంటుందండి, ఇరవై సంవత్సరాల తరువాత వచ్చింది అన్నాడు. ప్రింటూ, బొమ్మలూ కూడా చాలా బాగున్నాయి. కాబట్టి కొనేశాను. 'బుడుగు', 'బాపు బొమ్మల' వంటి పుస్తకాలు కూడా కొన మన్నారు, కాని మళ్ళీ వస్తానండి ఇక్కడే ఉంటాను అని చాలా వరకూ పక్కకు తీసేసా. సారాంశం ఎంటంటే, నా లిష్టులోనివి కొన్ని వారి దగ్గర ఉన్నాయి, ఉన్న వాటిలో ప్రింటు, బొమ్మలూ చూసి ఎంపిక చేశాను.

కొట్టలో మనుషులు
కొట్టులో నాకు మార్గదరకం ఇచ్చినతని తో మాటలలో పడ్డాను.
ఎఁవటండీ, అమెరికా తీసుకెళ్ళడానికా ఇవన్నీ ? లేదండీ.
ఇక్కడ ఉద్యోగం చేస్తున్నారా? లేదండి. మొన్ననే అమెరికాలో చదువు పూర్తి చేసుకొనొచ్చా.
MS ఆ ? అవునండి.
ఎందులో ? ఎలక్టికల్ ఇంజనీరింగ్.
ఇక్కడేక్కడ చదివావు? కేరళ ఆరీసి. అమెరికాకి వెళ్ళే ముందు బెంగుళూరులో పని కూడా చేసా ఒ రెండు సంవత్సరాలు.
మా అబ్బాయికి కూడా ఉద్యోగం వచ్చింది. టీసిఎస్ లో. (బాబోయ్ ఎక్కడ చూసినా వాళ్ళే, గాడిదల్లాగా) అవునా అండి, నేనూ పని చేసా టీసిఎస్ లో. మంచి కంపెనీ అండి. కాని ఐదు నెలలే చేశాను.
యా ఎందుకు ? ఇంకో కంపెనీకి మారాను. మూడు రెట్లు ఎక్కవ జీతం ఇస్తున్నారని, కానీ టీసియస్ చాలా మంచి కంపెనీ అండి. అక్కడ చేస్తే బాగుంటుంది. (బాగుంటుంది మై యాస్, ఇప్పుడు ఈయన ఇంటి కెళ్ళి ఆయని కొడుకుని కంపెని మారమని శావ దొబ్బుతాడేమో, అచ్చ తెలుగు నాన్న గారి లాగా)
ఇంతకూ అమెరికా నుండి ఎందుకు వచ్చాశావు ? ఉద్యోగం దొరకలేదా ? అవునండీ ఉద్యోగం రాలేదు.
ఎదోటి వస్తుందనుకుంటగా? వచ్చినా నాకు నచ్చినవి రాలేదండి.
(అప్పుడప్పుడూ గొఱ్ఱెల మందనుండి వైదొలగే నాలాంటోళ్ళు కూడా ఉంటారని, లోకులకి తెలియజెప్పడం నా ప్రస్తుత ప్రవృత్తిగా ఎంచుకున్నాను, అందులో భాగమే ఈ అమెరికాలో ఉద్యోగం సంపాదించడం చేతకాలేదనే ప్రచారం, లేక పోతే నన్నీ సాఫ్టువేరు-డబ్బుల అరాచకానికి చిహ్నంగా మార్చేసింది సంఘం. "ఆ అన్నయ్య చూడు ఇంచక్కా చదువు కున్నాడు, బోలెడంత డబ్బు సంపాదిస్తున్నాడు, అమెరికా లో చాలా మంచి యూనివర్సిటీలో చదువుతునానడు, ఇంకా బోలెడంత డబ్బు సంపాదిస్తాడు, నువ్వు కూడా చదువుకుంటే అలా అవుతావు". (బోలెడంత డబ్బు మై యాస్) దీని గురించి ఇంకా లోతుగా నా వచ్చే టపా 'గొఱ్ఱెల మంద, పుఱ్ఱెల వ్యాపారం' లో)

ఇప్పటికి చదివిన పుస్తకాలు
అసమర్థుని జీవ యాత్ర తో మొదలు పెట్టా, మొదట్లో చాలా వరకూ నా గురించే వ్రాస్తున్నాడేమో అని అనుమానం వచ్చింది. కాని సగం అయ్యింతరువాత ఆ భయం సందేహం తొలగి పోయాయి. చాలా బాగుంది పుస్తకం, ఆఖరున చాలా దుఃఖంగా, మాలాంటి అసమర్ధులకి చాలా నిరాశగా ముగించారు కథని. దాన్ని దిగమింగడానికి చాలా సేపు పట్టింది.

మధ్య మధ్యలో భారతంలో చిన్ని కథలు చదివా. చాలా బాగున్నాయి, మీరు కూడా వాటిని తప్పక చదవలి. చాలా మంచి నీతులు, మంచి కథలు, మంచి భాష వున్నాయందులో.

ఇక 'మహా ప్రస్థానం', 'అమృతం కురిసిన రాత్రి' అప్పుడప్పుడూ తిరగేస్తున్నాను. వాటి గురించి నేను చెప్పాల్సిన అవసరం లేదు. శ్రీశ్రీ గురించి అందరికీ తెలిసిందేగాని. తిలక్ కూడా చాలా బాగున్నాయి. అదే చేత్తో ఎంకి పాటలు కూడా చూస్తున్నా. వాటి గురించి నేను చెప్పాదేముంది. నాకస్సలర్థం అవనిదల్లా కృష్ణ శాస్త్రి!

నిన్ననే అంపశయ్య పూర్తయ్యింది. నా ఆకాశంలో ఉన్న ఎక్సుపెట్టేషన్లకు ఎం తీసి పోలేదు. నవల మధ్యలో చాలా భారీగా ఉన్నా, ముగింపు చాలా ఆశాభరితంగా ఉంది. కాబట్టి మంచిగా అనిపించింది. ఈవాళ కన్యాశుల్కం మొదలు పెడతాను.

అంపశయ్య కాలం లోనే మా నాన్న కూడా డిగ్రీ చదివారు, కాబట్టి ఆ రోజుల్లో సర్వవ్యాప్తమైన చలం కథల పుస్తకాలలో ఒకటి 'యవనవ్వనం' మా ఇంట్లో ఉంది. ఈ పుస్తకాలు కొనే ముందు దానిని చదివా. బాగున్నాయి కథలు. 'యవనవ్వనం' బాగా నచ్చింది. 'భార్య', 'సుశీల' బాగున్యాయి. 'నాయిడు పిల్ల' బానే ఉంది. 'మధుర మీనాక్షి' లో ఆ రోజుల్లో కామం అంటే ఎంటో తెలయకుండానే పిల్లల్ని కనే ఆడవారుండే వారని తెలుసుకున్నాను :). 'రెడ్డి రంగమ్మ' అంతగా నచ్చలేదనాలి. కాని పాత సాహిత్యం చదవడానికి ఈ పుస్తకం మంచి పునాది అయ్యింది.

నేను కొన్నవి మరీ మంచి పుస్తాకలూ, మరీ భారీ పుస్తకాలలా ఉన్నాయి. ఏ Jane Austen లాంటివో P.G. Wodehouse లాంటివో చిక్కితే బాగుండునని పిస్తుంది. 'చివరకు మిగిలేది' తలచుకుంటేనే భయం గా ఉంది. అదృష్టవశాత్తూ 'కన్యాశుల్కం', 'గణపతి' ఉండనేవున్నాయి.
నవతరంగం సినిమా తెవికీ పొద్దు కూడలి తెలుగుబ్లాగు సాహిత్యం