భాషందం, భువనందం, బ్రతుకందం

Friday, November 23, 2007

కవితలు వ్రాయడం ఎలా

నాలుగు కవితల అనుభవం వున్న నేను, మీ అందరికీ కవితలు వ్రాయడం ఎలాగో బోధింపదలచాను.
"అదేఁవిటీ, నీలాంటి పిల్ల కవి దగ్గరా మేము నేర్చుకోవలసింది?" అన్న ధర్మసందేహం మీకు కలుగవచ్చు.
తప్పులేదు, డబ్బులు కట్టారు కాబట్టి మీ గురువు అర్హతలు తెలుసుకునే హక్కు "సమాచార హక్కు చట్టం" మీకు కలుగజేస్తుంది. పెద్ద కవులు దగ్గర నేర్చుకుంటే, భావం ఛందస్సు, ఎలగెన్సు, వగైరా వగైరా ఉండాలి, ఉండకూడదు, ఉండీవుండనట్టువుండాలి వగైరా వగైరా అని చాలా క్లిష్టంగా చెబుతారు. కాబట్టి నాలాంటి చిన్న కవి దగ్గర నేర్చుకుంటే, మూడంచెల్లో మీరు కవితాస్వర్గద్వారతీరాలకు ఎలా లంఘించగలరో సునాయాసంగా తెలుసుకోవచ్చు. (ఈ వాక్యం చదివిన తరువాతైనా మీకు నా సామర్థ్యం మీద అపోహలు తొలగిపోవాలి).

ఉపోద్ఘాతం ("ఇప్పుడు వఱకు జరిగిన సుత్తేంటి మరి?" అంటారా)
నేను క్రిత శనాదివారాలు(వారాంతం అనడం నాకంతగా నచ్చుదు) బెంగుళూరు వెళ్లాను. ఈ సారి మంగతాయార్ల వెంట పడలేదు. అలానే మన బ్లాగర్లనూ కలవలేదు. పనులలో భాగంగా నేను బెంగుళూరులో దోమలూరి నుండి బనశంకరి బస్సులో వెళ్తున్నప్పుడు బెంగుళూరి మీద ఒ కవిత వ్రాసిపారేశాను. (ఈ వాక్యం చదివిన తరువాతైనా మీకు నా సామర్థ్యం మీద అపోహలు తొలగిపోవాలి). దాన్ని విశ్లేషిస్తూ మీకు కవిత ఎలా వ్రాయాలో చెబుతా.

బస్సెక్కే ముందు
బెంగుళూరు వెళ్తున్నాని తెలిసి మా స్నేహితులు ఉచిత సలహా పారేశారు "అక్కడ దోమలూరులో వున్న పలానా కంపెనీ ఆఫీసులోకెళ్లి, అమెరికా యాసతో మాట్లాడి, హెచ్చార్ అమ్మాయికి రెజ్యుమే ఇచ్చిరా" అని. ఆ పని చేయడానికి ప్రయత్నించాకాని, రిసెప్షన్ పిల్ల "మా ఫోన్ నెంబర్ కి ఫోన్ చేయండి, ఇంత దూరం రావాల్సిన శ్రమ తగ్గుతుంది" అని చెప్పి నన్ను తోలేసింది. అప్పుడు నాకు తట్టింది, బెంగుళూరు మనకంటే చాలా ముందు కెళ్ళిపోయింది, ఈ గాజు౨ మేడల్లో మనకు చోటు లేదని. దాని మీద కవిత రాయాలని పించింది. టెక్ పార్కు బయటకెళ్లి బస్సుకోసం నించున్నా. చూస్తే జోబులో ఐదువందలు తప్ప ఏం లేదు. కొట్టు కొట్టు కూ వెళ్లి చిల్లర అడుకున్నా(ఈ సంగతి గుర్తుపెట్టుకోండి). చివరకు ఎవరో ఇచ్చారు, తరువాత బస్సొచ్చింది బస్సెక్కా.

మెదటి పద్యం
నా దగ్గర అంకోపరిసంచిలో అంకోపరి బదులు 'శ్రీశ్రీ జీవిత చరిత్ర' మఱియూ తిలక్ 'అమృతం కురిసిన రాత్రి' వున్నాయి. (గమనించవలసిన విషయం, ముందు కవితలు వ్రాయడానికి స్ఫూర్తి ముఖ్యం. కాబట్టి మీరు నా కవితలు అచ్చు చేసుకుని, వాటిని మీ జేబులో పెట్టుకుని బస్సెక్కండి).
బెంగుళూరుని నేను గుర్తుపట్టలేదు!
మేడ కాంక్రీట్లారని అందానికి
బట్టలుగా సన్నని రోడ్లు చుట్టి
ఫ్లయ్యోవర్ల ఊక్సులు బిగించింది!
సాంప్రదాయం వదలి
సెక్సీగా తయారయ్యింది!
తిలక్ వ్రాసిన "నగరంలో హత్య" కవిత ఇలా మొదలవుతుంది.
హైదరాబాద్ నన్ను గుర్తించలేదు పలకరించలేదు.
పెద్ద పెద్ద వీధుల్లాంటి పైట సవరించుకుంటూ
తప్పుచేసిన ఆడదానిలా తప్పించుకు తిరిగింది
దీనికీ నా కవితకీ వున్న పోలిక కేవలం కాకతాళీయమే; అని మీరనుకుంటే పప్పులో కాలేసినట్టే. మొదటి పద్యాన్ని తిలక్‌లా మొదలు పెట్టి, అప్పుడే చూసిన టెక్పార్కు గురించి, బెంగుళూరి లోని ఇఱుకు రోడ్ల గురించి అదే రూపకంలో వ్రాసా. ఒకప్పుడు బెంగుళూరు లో చెట్లెక్కువుండేవి, ఇప్పుడు వాటిని నరికేసి అద్దాల మేడలూ, మెట్రోలూ కడుతున్నారు. అక్కడినుండి 'సెక్సీ' వచ్చింది. (దీని మీద మరింత వివరణ తరువాత)

రెండో పద్యం
అందని ద్రాక్షలు పుల్లన. మనకెలాగూ ఉద్యోగం ఇవ్వట్లేదు కాబట్టి, "ఏవరికి కావాలి మీ బోడి ఉద్యోగం" అన్నదాన్ని కొద్దిగా ఉత్ప్రేక్షిస్తే ఇలా తయారవుతుంది.
అద్దాల మేడలలోని చీకటిగదులలో
ఉక్కు సంకెళ్ళతో బందింపబడ్డ ఆత్మలు
నాక కనబడవనుకుంది.
అలాగే పెద్ద పెద్ద ఉద్యోగాలు చేస్తే సరిపోదు, పేదలని నిజంగా అభివృద్ధి పరచడం గొప్ప (ఇది అసాధ్యం కాబట్టి)...
వంతెనల క్రింద గుడిసెలకూ
ముఱికి కాల్వల ప్రక్క మకాఁలకూ
ఋజువులు చూపించమంది.
అదే ధొరణిలో
ఐదువందలకు చిల్లరడిగితే అవతలికి పొమ్మంది.
ఐద్దమ్మిడీల బిళ్ల చూపిస్తే అదేఁవిటనడిగింది.
బస్సెక్కేముందు జరిగింది ఎలావుంది అలానే వ్రాసేయండి. దాని తరువాత... బస్సులో టికెట్లన్నీ రూపాయల్లోనే వుంటాయి. నా జేబులో యాభై పైసుల బిళ్లవుంది. అది చూపిస్తే నిజంగానే అవతలకి పొమ్మంటారు. కాబట్టి అదికూడా వ్రాయండి.

మూడో పద్యం
నేను కుటుంబం పని మీద ఎవరినో రైలు ఎక్కించడానికి స్టేషను వెళ్లా. అక్కడొకమ్మాయి, మన భీమవరంమే అయినా, మా బామ్మాళ్లతో ఆంగ్లం యాసతో తెలుగు మాట్లాడింది. బెంగుళూరులో ఇంలాంటి వారికి కొదవలేదు. కాబట్టి ఇది వ్రాయడం కూడా తేలికే.
ఆంగ్లం యాసలో కన్నడమూ
అజంత యాసలో ఆంగ్లమూ మాట్లాడి
అప్పుడే అమెరికా తిఱిగొచ్చిన
అచ్చతెలుగమ్మాయిలా, లేని
ఆత్మ విశ్వాసం నటించింది!

నాల్గో పద్యం
బస్సులో నా వెనుక సీటులో ఒక తెలుగతను "ఎరా ఐడోన్ట్‌నో సిస్టంస్ లో సి అడుగుతున్నాడా, జావా అడుగుతున్నాడా" అని ఫోనులో మాట్లాడుతున్నాడు. అలాగే ఇంకో తమిళతను "మచ్చా చావరియా పటమ్ నోకియా" అని మాట్లాడుతున్నాడు. ఆ రెండిటినీ ఇక్కడ.
జాబుకీ జావాకీ ముడివేసే తెలుగబ్బాయిలతో,
'చ'కీ 'శ'కీ తేడా తెలియని తమిళ తంబీలతోనూ,
సిరిగన్నడం సిరులకోసం హతమార్చిన కన్నడిగులతోనూ
పబ్లిక్ పార్కులలో పట్టపగలు చెట్టాపట్టాలేసుకు తిరిగింది!
బెంగుళూరు నిండా పార్కులే, అలాగే జేపీ నగర్ లో ఒకటి కనిపించింది. అప్పటివరకూ తెలుగు, తమిళ, అరవ కుఱ్ఱాళ్లతో ఏఁవ్ చేయ్యాలో అర్థంకాని నాకు. బల్బు ఎలిగింది. ఇక..
అందేఁవిటని మందలిస్తే
డబ్బుతీసుకొని టికెట్టివ్వని
బె.మ.సా.సం. బస్సామెలా
వినీ విననట్టు వూరుకుంది.
ఇది బెంగుళూరు బస్సుల్లో ఎప్పుడూ జరిగేదే. ఆడామగా కండెక్టర్లిఱువురూ చేసేదే.

ఐదే పద్యం
నిజంగానే బెంగుళూరులో నాకు కావాల్సిన ఉద్యోగాలు లేవు. న్యూయార్కో, లండనో, హాఙ్ కాఙ్‌గో వెళ్లాలి (అంటే వాళ్లు రానిస్తే). అదీ ఇక్కడ పారేశా.
ఉద్యోగఁవిమ్మంటే, "మీ స్థాయికి మేఁతూగగలమా
సింగపురమో సికాగోనో పొమ్మ"ని ఎగతాళి చేసింది.
ఒకప్పుడు నేను జీవితంలో డబ్బు, పెట్టుబడిదారు వ్యవస్థ వంటి వాటిలో నమ్మేవాడిని, అప్పటిలో "అదృష్టవంతుడను నేను, వడ్డించిన విస్తరి నా జీవితం". బెంగుళూరేఁవీ మారలేదు. రెండేళ్ల క్రితం ఎటు పోతుందో, ఇప్పుడూ అంతే, మారిందల్లా నేనే అన్న విషయం ఇక్కడ వ్రాసా.
సరే వెళ్లోస్తానంటూ వెనుతిఱగబోతే,
"నువ్వు చాలా మారిపోయావు బావా" అని
భుజం మీద వాలి బోరున యేడ్చింది.

రూపకం
ఈ ఒక్క అలంకారం తెలిస్తే చాలు మీర ఒక మోస్తరు నుండి భారీ కవి కావచ్చు. నా పేరే ఒక రూపకం కాబట్టి, అక్కడ నాది కొద్దిగా ముందంజ. (పేరుకు అర్థం అడగకండి).
నవ్యసమాజం ఎప్పుడూ "ఖండాంతర వాసులతో సంభాషిస్తున్నాం, గ్రహాంతర వాసులకు సంకేతాలు పంపిస్తున్నాం" అని ప్రగల్బాలు(?) పలకడమేగానీ, పెద్ద మనిషైన పదేళ్లకు కూడా కుఱ్రవాళ్లకు పెళ్లి చేయలేకపోతున్నది. అలాంటి కుఱ్ఱవాళ్లకి ఇంకేంచూసినా అమ్మాయే కనిపిస్తుంది. మామూలు అమ్మాయి కాదు సంప్రదాయాన్ని విడిచి సెక్సీగా తిరిగే అమ్మాయి, పార్కులలో చెట్టాపట్టాలేసుకు తిరిగే అమ్మాయీ, బావా అని పిలిచే అమ్మాయీ కనిపిస్తూంటారు. అద్దంపద్దం(అర్థంపర్థం?) లేని బెంగుళూరు నగరాల్ని చూసినా అంతే! అలాగే, మీకు అప్పడాలంటే భ్రమ అనుకోండి, మీరు లిబర్టీ విగ్రహాన్ని అప్పడంగా భావించి ఓ కవిత వ్రాయండి. ఉదాః
గేసు పొయ్యలాగా కాగుతున్న వేడి న్యూయార్కు దినాన,
లిబర్టీ విగ్రహం అప్పుడే వేసిన అప్పడం లా కాగిపోతుంది.
తాకడానికి వేడిగా, తినడానికి కరకరలాడేట్టుంది.
శబ్ద మఱియు ఇతర అలంకారాలు
నేను వ్రాసిన నిరుద్యోగులు పద్యాన్ని పైవిధంగా విశ్లేషించడం అంత తేలిక కాదు. పైది తిలక్ శైలి, ఇది మాత్రం శ్రీశ్రీ శైలి.
విశ్లేషణ కష్టం కానీ, శ్రీశ్రీ శైలి లో వ్రాయడం మాత్రం చాలా తేలిక. మీకు తోచినట్లు వ్రాయండి. కొద్దిగా మాత్రాఛందస్సు వాడండి. రూపకాలం'కారాల'తో రెచ్చిపోండి. కొంత కాన్సొనెన్సు(తెలుగులో?) వాడండి.
ఉదాహరణకు
అసమర్థ చితులుండే శ్మశానాల్లో,
కాలని కళేబరాల పేలని పుఱ్ఱెలు
***
నత్తనడకన సాగే ఎకానమీకి,
నివాళులొసగు హారతి కర్పూరాలు !
జనులు "అసమర్థ చితులు కాకపోతే సమర్థ చితులుంటాయా ఎక్కడైనా?", "కళేబరం కాలనప్పుడు పుఱ్ఱైనా ఇంకోటైనా ఎలా పేలుతుంది?", 'నత్తకెవరైనా మంగళారతి పడతారా?" అని ప్రశ్నించరు! దాని బదులు అద్భుతమనీ, పత్రికలకు పంపాలనీ అంటారు. ఇక...
శోకమనే సెలయేటిలో కాగిన
పాకంపట్టని గులాబ్జామూఁలు !
ఆ రోజు నిజంగా మా అక్క గులాబ్జామూఁలు చేసి వాటికి పాకం పట్టలేదు. కానీ ఇలాంటివి కవనవ్యాపార రహస్యాలు. వీటిని బయటకు చెప్పకూడదు. నేను నా గురువృత్తి ధర్మానికి అన్యాయం చెయ్యలేక మీకు చెబుతున్నాను. (ఈ వాక్యం చదివిన తరువాతైనా మీకు నా సామర్థ్యం మీద అపోహలు తొలగిపోవాలి).

త.రా: ఇంకేముంది కష్టమైన వృత్తాలు విడచి, అభ్యుదయపూరిత బావ కవిత్వం వ్రాయండి!

16 comments:

  1. తమమీద తామె ఛలోక్తులేసుకుని నవ్వ (నవ్వించ) గలిగిన వారిదే అసలైన హాస్యచతురత కదా?

    ReplyDelete
  2. తమ సామర్థ్యాన్ని తామే పొగిడేసుకొని తృప్తిపడ గలిగిన వరిదే అసలైన అహంకారము కాదా మరి? :D

    ReplyDelete
  3. మన భీమవరమా చెప్పారు కాదేం ఇన్నాళ్ళూ...
    ప్రత్యేక భీమవరం జిందాబాద్,
    సోనియా గాంధీ వెంటనే ప్రత్యేక భీమవరం రాష్ట్రం వెంటనే ప్రకటించాలి రాజధాని మాత్రం గునుపూడిలోనే వుండాలి.

    టపా బాగుంది, కాని వివరంగా ఇప్పుడు చదవలేను, చదివాక పొగుడుతూ కామెంటేస్తా, మనం మనం భీమవరం కదా...

    నెనర్లతో
    ఈ ఒక్క సారికీ భీమవరం వాక్కు,
    తరువాత మామూలే -- బాలవాక్కు

    ReplyDelete
  4. అన్నీ చెప్పారు, బానే ఉంది. మరి మీలాగా, ఇలాగా సద్యస్ఫూర్తిని సంపాదించుకోవడం ఎలా? అదీ చెప్పండి!

    ReplyDelete
  5. మాగురువుగారు బూదరాజు రాధాకృష్ణ గారు రాసేవారు ఇలాగ. వారు రాస్తే ఏ ఒక్క విషయమూ వదిలేవారు కాదు. రాస్తున్న విషయానికి ఏమాత్రం సంబంధం ఉన్నా ప్రస్తావించి, వివరించేవారు. నేను ఆయన దగ్గర ప్రత్యక్షంగా చదువుకోలెదు, కాని ఒకసారి కలిసి మాట్లాడాను. మళ్ళీ మీ టపా చుస్తే ఆయన గుర్తుకు వచ్చారు. ఇది మనం మనం భీమవరం అని కాకుండా అనుభూతితో చెబుతున్నా. మీ పాత టపాలు కూడా ఇప్పుడే చదివాను. చాలా బాగున్నాయి.
    నెనర్లతో
    బాల వాక్కు

    ReplyDelete
  6. @ చదువరి గారు,
    సద్యస్ఫూర్తి - spontaneity
    అద్భుతమైన పదం నేర్పారు. మీరిలాగే టపాకో పదం నేర్పితే. త్వరలో నా పదసంపద వృత్తాలు సదుపాయించే స్థాయికి చేరుకుంటుంది.

    @ బ్రాహ్మీ గారు,
    మాది అచ్చంగా భీమవరం కాదు, రెండు టేషనలు దాటాక వచ్చే నిడదవోలు దగ్గర.
    కానీ మన ఉభయ గోదావరి జిల్లాలకు త్వరలో స్వరాజ్యం వచ్చినప్పుడు, మీ భీమవరాన్ని autonomous ప్రాతం గా ప్రకటించుదాం.

    మీ అభినందనలకు కృతజ్ఞతలు, మీరు చెప్పారుగా నేను అవకాశం వచ్చినప్పుడు బురుదురాజు గారి వ్యాసాలు చదువుతాను.

    ReplyDelete
  7. రాకేశ్వరా నీకు నీవే సాటి.బావ కవిత్వములొ తెలుగు బ్లాగర్లలొ,ఆంధ్ర,ఆంధ్రామెరికా భువిలో. సరే ఇప్పటికి ఒకసారి టంగు తెగించుకొన్నాను మళ్ళి మీతో తెగించుకోవాలని లేదు.
    మరదల కవిత్వము రాయలని లేదు.నా మీద నువ్వు ఎలాగు చురక వేస్తావు దానిని సంతోషము తో అంగీకరిస్తాను

    ReplyDelete
  8. క్షమించాలి భావ కవిత్వమున మీరు ,బావమరదల కవిత్వములొ నేను ఎవరికి వారే సాటి. చురకంటకుండానే టంగు తెగింది.

    ReplyDelete
  9. @బ్రాహ్మీ గారు.ఒక్కసారి మాట్లాడినందుకే బూరా ను మా గురువు గారు అనటం బావుంది.ఎదుటి వారి మీద గొప్ప ప్రభావం చూపగల భాషావేత్తల్లో అగ్రగణ్యులు బూరా.నేను అయనకు ప్రత్యక్ష శిష్యుడ్ని నేను. ఈనాడు జర్నలిజం బడి విద్యార్ధిని.తెలుగు జర్నలిజానికి దూరమయినా నేను రాసే ప్రతి పదం వెనుకా బూరా శిక్షణ ఉంది.

    దేవరపల్లి రాజేంద్ర కుమార్

    http://visakhateeraana.blogspot.com/

    ReplyDelete
  10. really one of the good posts i have read in recent times.

    ReplyDelete
  11. @ బ్లాగేశ్వరా,
    నాకు కూడా ఆటవెలది గణాలు అర్థంకావడానికి సమయం పట్టింది. వికీలో స్పష్టంగా లేక పోవడం ఒక కారణం.
    మీరు వ్రాసిన కవితలు మాకు తప్పని తెలిసినా,
    గణాలు కుదరలేదని తెలిసేదిగానీ, గణవరస మాత్రమే తప్పని మేము గ్రహించలేకపోయాం, లేక పోతే ఇంతకు ముందే చెప్పేవారం.
    కనీ మీ ఇటీవల కందం చూస్తే అవి నేను అప్పుడెప్పుడో వ్రాసినవాటికంటే ఎన్నోయింతలు మెఱుగుగా వున్నాయి. ఇలాగే కొనసాగించండి.

    @ mohanrazz (మోహన రాజు?)
    మీ అభినందనలకు కృతజ్ఞతలు.

    ReplyDelete
  12. అద్భుతం!
    పూర్వ రంగంలోని S.S.ను నేనే.విమర్శ హద్దు దాటినా నిజాయితీగా ఆ టపా చదవగానే నాకొచ్చిన భావాన్ని తెలిపాను.అది టపా పై వ్యాఖ్య కానీ రచయితపై కాదు సుమా! అయితే శ్రీశ్రీ పంకానే అనుకోండి.

    ReplyDelete
  13. రాకేశా,
    ఈ.ఫ్. కట్టి దాచుకోవాల్సిన విషయాలు ఇట్టా ప్రకటించేస్తే, ఎట్టా?
    వాసి కెక్కిన రచైతలు, "పాపులారా! రచైతలు కావటం ఇలా" అని వర్కుషాపులు నడుపుతున్నారు, ఈ భాగ్యనగరం లో.. గమనించవలసినది.

    లేకపొతే అనతికాలం లో వాళ్లు ఐటీపార్కు ముందు బ్లాకులొ సిగిరెట్లు అమ్ముకొని, బండి కిందభాగాన్ని అంకోపరిభద్రపరుచుగది (మంగతాయారుని దర్శించుకొచ్చేదాకా) గా మార్చి బతకవలిసి రావచ్చు.
    ఊ.దం

    నాకు ఇంకో - ౩౦ టపాలు రాయటానికి - వస్తువునిచ్చావు..
    రేపటినుంచి నేనిప్పటి దాక రాసిన టపాలని ఏ కీలుకాకీలు విరిచి విశ్లేషిస్తాచూడు..

    ReplyDelete
  14. రాకేశా,
    "I.P.R కట్టి" అని చదువుకోండి.
    ఏంటో తొందరలో ఏకవచనమాడేశాను. ఏమనుకోకండేం.
    -ఊ.దం

    ReplyDelete
  15. @ ఇస్మైల్ గారు,
    మీరు s.s. వ్యాఖ్య అనగానే నాకు ఏమీ గుర్తుకురాలేదు, వెనక్కివెళ్లి చూడాల్సి వచ్చింది.
    despicable అనే పదానికే మీరి హద్దు దాటిన అంటే నాకు నిజంగా నవ్వొస్తుంది.
    నా బ్లాగులో మీకు ఎటువంటి మొహమాటాలు అక్కరలేదు!

    @ ఊదం గారు,
    మీ వెటకారం పూర్తిగా అర్థం కాలేదు గానీ.
    అర్థం అయినదాని బట్టి,
    విద్యనీ భోజనాన్ని అమ్మడం మహాపాపమని శాస్త్రాలు చెబుతున్నాయి. కాబట్టి నేనిలా నలుగురికీ ...

    ReplyDelete
  16. adirindi guruvu gaaru, nagaram lo vaana la ga baagundi

    ReplyDelete

నవతరంగం సినిమా తెవికీ పొద్దు కూడలి తెలుగుబ్లాగు సాహిత్యం