భాషందం, భువనందం, బ్రతుకందం

Friday, June 22, 2007

ఉపగణాలని అర్థంచేసుకోవడం ఎలా ?

నేను ఈ మధ్య తెలుగు కవిత్వాన్ని నేర్చుకుంటున్నాను.

కందసిద్ధాంతం బాగానే అర్థమయ్యింది. దానిలో పద్యాన్ని నాలుగు మాత్రల ముక్కలుగా రాస్తారు, కాబట్టి నాలుగు మాత్రల బరువున్న ఎ గణోపగణాలనైనా వాడొచ్చు. అవేంటో ఎవరైనా చెప్పగలరు,
నల (IIII), భ(UII), జ(IUI), స(IIU), గగ(UU) అని.

కందంలో నియమాలు ఎక్కవైనా అవన్ని చాలా అర్థవంతంగా ఉంటాయి.
ఉదాహరణకు, రెండు, నాలుగు పాదాలలో మధ్య గణం జ లేదా నల అయ్యుండాలి. అది సిమెట్రీ కోసం అలా నిబంధించారిని సర్దిచెప్పుకోవచ్చు.

అందరూ తెలుగు పద్యరీతుల్లో కందం కష్టమన్నా, నాకు మాత్రం కందసిద్ధాంతం బాగా అర్థమయి రెండు వారాలలో నాలుగు వ్రాయగలిగాను, ఇప్పుడు వాటికన్నా తెలికపాటివైన తేటగీతి లాంటివి నేర్చాలని బయలుదేరితే, ఆ సూర్యేంద్ర గణాల వెనకున్న సిధ్ధాతం నాకు పట్టట్లేదు.

సరే సూర్యగణం అంటే మూడు మాత్రల బరువు ఉండాలి అనుకుందాం..
న (III) మరియు హ (UI) బానే ఉన్నాయి. ఐతే అక్కడ వ (IU) కూడా ఉండాలిగా లేదేంటి ?

ఇక ఇంద్రగణాలకి వస్తే నాకు ఇవసలు అర్థం కాలేదు.
ర(UIU), త(UUI) ఉన్నాయిగానీ అక్కడ వాళ్ళ అక్క, య(IUU) గణం లేదు కాని పక్కింటోళ్ళమ్మాయి భ(UII) ఉంది. అన్యాయం (నిజానికి నా అంధకారం అనుకోండి). నగ, సల, నల ఎందుకున్నాయో ?

ఇక చంద్రగణాలకి వస్తే,
నా పేరు పెట్టుకున్నాయి, ఒ పద్నాలు రకాలున్నాయి కాని నాకొక్కముక్క సమజయితల్లేదు బయ్.

కందం మొదలు పెట్టి మంచి పని చేసా,
అక్కడ నుండి క్రిందికి ఉపజాతులకి వెళ్దామంటే సూర్యేంద్ర గణాలు గీఈఈఈఈ అని ఎక్కిరిస్తున్నాయి.
పైకి వృత్తాలలోకి వెళ్దామంటే, ఉత్పలమాల చంపకమాల "మొహం అద్దంలో చూసుకున్నావా?" అన్నట్టున్నాయి.

అందుకే ప్రస్తుతానికి మత్తకోకిల లయ మెదడులోకి ఎక్కిస్తున్నా..
మత్త కోకిల మత్త కోకిల మత్త కోకిల కోకిలా
తాన తానన తాన తానన తాన తానన తాననా
మంచి రామయ చెత్త రావణ మంచి రామయ రామయా
వగైరా వగైరా, పాడుకోవడానికి బాగుంది గాని, వ్రాయడం కో.క.లకి అంత తేలిక కాదనుకుంట..


ఏదేమైనా పెద్దలెవరన్నా వీటిని
intuitive గా చెప్పగలిగితే చాలా సంతోషిస్తాను.
నేను మాత్రల బరువు పరంగా ఆలోచిస్తున్నాను, అది కందం విషయంలోనే వర్తిస్తుందనిపిస్తుంది. అలాంటి ఆలోచనా రీతులు వేరే ఉంటే పరిచయం చెయ్యగలరు. నేను తెలివైన కుర్రాడిని కాబట్టి మీరు చెప్పగానే టపీ మని పట్టేసి, తరువాత చిన్నా చితకా ప్రశ్నలు వెయ్యనని ప్రామిస్. :)

4 comments:

  1. నేను హ్యాండ్సప్ - అంటే చేతులెత్తేశాను. ఆటవెలది రాయాలంటే నాకు తెవికీ అందుబాటులో ఉండాల్సిందే. ఇంద్రగణాలన్నీ గుర్తుంచుకోలేకపోయాను. అందులోని intutiveness తెలుసుకోకపోవడం వల్లనే ఈ అవస్థ. అడగాలన్న ఆలోచనకూడా రాలేదు. "ఘనసింహంబుల కీర్తి నీచమృగముల్ గైకొన్న చందంబునన్" నీ పుణ్యాన గురువులు ప్రసాదించే జ్ఞానంకోసం కాసుక్కూర్చున్నాను ఈ టపా మాటున.

    ReplyDelete
  2. సూర్యగణాలంటే మూడు మాత్రలతో ఏర్పడేవే కాని వాటిల్లో లగం (IU) మాత్రం లేదని గమనిక. తెలుగు హలంత భాష గనుక (కనీసం ఈ గణాలు ఏర్పడే నాటికి) తెలుగు ఛందస్సులలో లగానికి స్థానం లేదు. లగానికే మరో పేరు హగణం.

    భగణ (UII),తగణ (UUI), రగణాలు (UIU) ఇంద్రగణాల్లో భాగం. ఇంకా రెండు సంస్కృత గణాలకి ఒక లఘువు చేరిస్తే ఇంద్రగణాలేర్పడతాయి.

    1. నగణం ప్లస్ ఒక లఘువు - III + I = IIII దీనికి నలం అని పేరు.

    2. సగణం ప్లస్ ఒక లఘువు - IIU + IIUI దీనికి సలం అని పేరు

    జగణం (IUI)ఇంద్రగణాల్లో భాగం కాదు.

    చంద్రగణాలు నాకు బాగా గుర్తులేవు. వాటితో నేనే ప్రయోగాలూ చెయ్యకపోవడాన. అయితే మనకంటే కన్నడం వాళ్ళకే వాటితో ఎక్కువ పని అని మాత్రం చెప్పగలను. కాబట్టి వర్రీ కాకండి.

    ReplyDelete
  3. పొఱపాటు జరిగింది. పైన కనిపిస్తున్న నా వ్యాఖ్యలో రెండో పంక్తిని "తెలుగు హలంత భాష కాదు గనుక" అని సవరించుకోగలరని ప్రార్థన.

    ReplyDelete
  4. మరో విషయం. పద్యాలు రాయడానికి ఉద్దేశించినవి కావు. పాడడానికి ఉద్దేశించినవి. (మీకీ సరికే అర్థమైపోయి ఉంటుందిలెండి)వ్యాకరణం ఆలోచిస్తూ ఎలాగైతే మాట్లాడలేమో గణాల గుణాల గురించి ఆలోచిస్తే పద్యాలు కట్టలేము. ముందు పద్యాలు పాడాలి. ఆ లయలోనే మనకెన్నో కొత్త రచనలు స్ఫురిస్తాయి. ముందు నియమాన్ని నియమంగా కొంత కాలం పాటు అనుష్ఠిస్తేనే ఆ తరువాత దాని అంతరార్థం బోధపడుతుంది.

    ReplyDelete

నవతరంగం సినిమా తెవికీ పొద్దు కూడలి తెలుగుబ్లాగు సాహిత్యం